
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని పర్యాటక అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీ టీడీసీ) సరికొత్త ఆలోచనలతో అడుగులు వేస్తోంది. పర్యాటకులకు ప్యాక్ చేసిన రుచికరమైన భోజనం, స్నాక్స్ అందించేందుకు ‘అమృత్ కియోస్క్’లను తీసుకొస్తోంది. రాష్ట్రం మొత్తం తొలి విడతలో 100 కియోస్క్‌లు ఏర్పాటు చేయనుంది. తద్వారా నిరుద్యోగ యువతకు వ్యాపార అవకాశాలు కల్పించడమే కాకుండా పర్యాటకులను మరింతగా ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఆహారం నుంచి కూల్‌డ్రింక్స్ వరకూ..
అమృత్ కియోస్క్‌లను రెండు భాగాలుగా నిర్మించేందుకు టెండర్లు ఆహ్వానించారు. మైల్డ్ స్టీల్ (ఎంఎస్) వేరియంట్, ఫైబర్ రీన్‌ఫోర్స్‌డ్ పాలిమర్ (ఎఫ్‌ఆర్‌పీ) వేరియంట్‌గా వీటిని డిజైన్ చేయనున్నారు. ఎంఎస్ వేరియంట్‌లో మూడు వైపులా టఫ్నెడ్ గ్లాస్ ఏర్పాటు చేసి.. అందులో ఎగ్జాస్ట్ ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్లు, ఎల్‌ఈడీ లైట్స్, ఫ్రంట్ డిస్‌ప్లే బోర్డు, వాటర్, విద్యుత్ సరఫరాకు అనుగుణంగా నిర్మించనున్నారు. ఎఫ్‌ఆర్‌పీ వేరియంట్‌లోనే స్నాక్స్, ఇతర ఫుడ్ ఐటెమ్స్ ప్రిపేర్ చేసేందుకు అవసరమైన నిర్మాణాలు, పరికరాలుంటాయి. 15 ప్రీసెట్ మెనూతో నడిచే ఆటోమేటిక్ ఫ్రయ్యర్, మిల్క్‌షేక్ మెషినరీ, మోమో స్టీమర్, హాట్ గ్రిల్ ప్లేట్‌తో పాటు వర్టికల్ ఫ్రీజర్, 23 లీటర్ల సోలో ఓవెన్, 12 లీటర్ల ఆయిల్ సామర్థ్యం గల ట్యాంక్, ఫ్రెంచ్ ఫ్రైస్ కట్టర్, స్టాక్ బౌల్స్, స్క్వీజ్ బాటిల్, లిమన్ స్క్వీజర్, మాండోలిన్ వెజ్ కట్టర్, సూప్ చేసే బౌల్, డస్ట్ బిన్ మొదలైనవి ఉంటాయి. టూరిస్టులకు కావల్సిన కూల్ డ్రింక్స్ కూడా సర్వ్ చేసేలా ఈ కియోస్క్‌లో ఏర్పాటు చేయనున్నారు.
సీఎం మార్గదర్శకాల నేపథ్యంలో..
‘భారత్‌లో అడుగుపెట్టే ప్రతి పర్యాటకుడు రాజస్థాన్ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. అక్కడి పర్యాటక ప్రాంతాల్లో అంతర్జాతీయ సదుపాయాలు ఉండటమే దీనికి కారణం. పర్యాటకంగా ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచంలో ప్రముఖ స్థానంలో నిలిపేలా చర్యలు తీసుకోవాలి. ఆతిథ్యం, పర్యాటక రంగాల్లో పేరు ప్రఖ్యాతలున్న సంస్థలు హోటళ్లను ఏర్ప్పాటు చేసేలా ఉత్తమ సదుపాయాలు కల్పించాలి. దీనివల్ల రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలపై అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రచారం లభిస్తుంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యాటక శాఖ అధికారులకు మార్గనిర్దేశం చేశారు.
ముఖ్యమంత్రి సూచనల మేరకు ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కొత్త విధానాలపై దృష్టి సారించింది. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు ఆహారం విషయంలో ఇబ్బందులు పడకుండా కియోస్క్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అమృత్ కియోస్క్‌ల పేరుతో ఫ్రాంచైజీ మోడ్‌లో కో–బ్రాండ్ భాగస్వామి ద్వారా ప్యాక్ చేసిన ఆహారం, స్నాక్స్, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ వంటి వాటిని పరిశుభ్రంగా టూరిస్ట్‌లకు అందించనున్నారు.