
దొండపర్తి(విశాఖ దక్షిణ): విద్యుత్ కాంతులు విరజిమ్ముతున్నాయి. రోడ్లు మెరిసిపోతున్నాయి.. రోడ్ల మధ్య ఉన్న డివైడర్లు పచ్చని మొక్కలతో అలరిస్తున్నాయి.. రోడ్డుకు ఇరువైపులా గోడలపై తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే కళారూపాలు ఆకర్షిస్తున్నాయి. జంక్షన్లు, ట్రాఫిక్ ఐలాండ్‌లు విభిన్నంగా ఏర్పాటు చేసిన కళాకృతులు ఆకట్టుకుంటున్నాయి. కై లాసగిరి, సీతకొండల రాళ్లపై చిత్రాలు ప్రతి ఒక్కరినీ కట్టి పడేస్తున్నాయి. పర్యాటక ప్రాంతాలు మరింత అందంగా ముస్తాబయ్యాయి. కొత్త బీచ్‌లతో పాటు ఐలవ్ వైజాగ్ సెల్ఫీ పాయింట్, సోలార్ ట్రీ వంటివి పర్యాటకులను ఆహ్వానిస్తున్నాయి. ఇలా సిటీ ఆఫ్ డెస్టినీ మరో అంతర్జాతీయ సదస్సుకు సన్నద్ధమైంది. ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జీ–20 సదస్సుకు సాగర తీరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్ మరింత పెంచేలా.. దేశం గర్వించేలా సదస్సును విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో విశాఖ నగరం మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించే విధంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ప్రపంచ దేశాల నుంచి వచ్చే అతిరథ మహారథులందరినీ కట్టిపడేసేలా రూ.157 కోట్లతో నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది.
తొలిసారి అవకాశం
విశాఖ అనేక అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలకు వేదికగా నిలుస్తోంది. తాజాగా ప్రతిష్టాత్మక జీ20 సదస్సుకు ఆతిథ్యమిస్తోంది. ఇటీవలే దేశ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయింది. దిగ్గజ పారిశ్రామికవేత్తలు విశాఖలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, వనరులను ప్రపంచ దేశాలకు తెలియజెప్పారు. తాజాగా జీ–20 సదస్సు కోసం విదేశాల నుంచి ప్రతినిధులు విశాఖకు వస్తున్నారు. ‘వన్ ఎర్త్.. వన్ ఫ్యామిలీ.. వన్ ఫ్యూచర్’ అనే థీమ్‌తో రాడిసన్ బ్లూ బీచ్ రిసార్ట్‌లో జీ–20 సదస్సు జరగనుంది. ఇప్పటికే 57 మంది ప్రతినిధులు విశాఖకు చేరుకున్నారు. తొలి రోజు మూడు విభిన్న అంశాలపై సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ సదస్సును ప్రారంభించనున్నారు. సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సదస్సుకు హాజరవుతున్నారు. వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నారు. రెండో రోజు 29వ తేదీన మౌలిక సదుపాయాల కల్పన అంశంపైన, మూడో రోజు 30న కెపాసిటీ బిల్డింగ్‌పై వర్క్‌షాప్ నిర్వహించనున్నారు.
భారీ పోలీస్ బందోబస్తు
జీ–20 సదస్సుకు పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. 2,500 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో కటుదిట్టమైన బందోబస్తు కల్పిస్తోంది. ఇందులో 1,850 మంది సివిల్ పోలీసులు, 400 మంది ఆర్మ్‌డ్ రిజర్వ్, 4 గ్రే హౌండ్స్ దళాలు, 2 క్యూఆర్టీ టీమ్స్, 6 ప్రత్యేక పార్టీలు, 2 ఏపీఎస్పీ ప్లాటూన్లను మోహరిస్తున్నారు. ప్రతినిధుల భద్రతా చర్యల్లో భాగంగా ఆరు ప్రాంతాలను రెడ్ జోన్లుగా పోలీసులు ప్రకటించారు. రాడిసన్ బ్లూ రిసార్ట్, ఆర్‌కే బీచ్ రోడ్, కై లాసగిరి, ముడసర్లోవ పార్క్, జిందాల్ ఎనర్జీ ప్లాంట్, స్కాడా మాధవధార ప్రాంతాలకు రెండు కిలోమీటర్ల పరిధిలో 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు డ్రోన్ల ఎగరవేతపై పోలీసులు నిషేదం విధించారు. ఇప్పటికే విదేశీ ప్రతినిధులు పర్యటించే ప్రాంతాల్లోను, వారు బస చేసే హోటల్ వద్ద బాంబ్, స్నిఫర్‌డాగ్ బృందాలతో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కటుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు.