
ముడసర్లోవ రిజర్వాయరులో సోలార్ ప్లాంట్
ఆరిలోవ(విశాఖ తూర్పు): జీ–20 సదస్సుకు విచ్చేసే విదేశీ అతిథులను ఆకట్టుకోవడానికి ముడసర్లోవలోని ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ముస్తాబైంది. జీవీఎంసీ అధికారులు సుమారు రెండు నెలలుగా ఈ ప్లాంట్ వద్ద సుందరీకరణ పనులు చేపట్టారు. నగరంలో మంగళవారం నుంచి జరగనున్న జీ–20 సదస్సు కోసం భారత్‌తో పాటు యూఎస్‌ఏ, యూకే, రష్యా, ఫ్రాన్స్, చైనా, కెనడా, జర్మనీ, ఇండోనేషియా తదితర దేశాల నుంచి ప్రతినిధులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. సదస్సు అనంతరం ముడసర్లోవ రిజర్వాయరులో జీవీఎంసీ ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ను ఈ నెల 30న అతిథులు సందర్శించనున్నారు. దీంతో ఈ ప్లాంట్ వద్దకు వెళ్లే రహదారికి ఇరువైపులా పచ్చదనం, పూల మొక్కలతో తీర్చిదిద్దారు. హనుమంతవాక నుంచి పెదగదిలి, చినగదిలి, దీన్‌దయాళ్‌పురం, రామకృష్ణాపురం కూడళ్లలో బీటీ రోడ్డును ఆధునికీకరించారు. నీటిలో తేలియాడే సోలార్ పలకల వద్దకు అతిథులు వెళ్లడానికి అనువుగా కొత్త హంగులతో వంతెన సిద్ధం చేశారు. విశ్రాంతి తీసుకోవడానికి ఆధునిక వసతులతో తాత్కాలికంగా టెంట్ హౌస్, మరుగుదొడ్లు నిర్మించారు. ప్రముఖులు రానుండడంతో ముడసర్లోవ ప్రాంతంలో పోలీస్ భద్రత పటిష్టం చేశారు. సోమవారం సాయంత్రం నుంచి ఈ ప్రాంతంలో పలు నిషేధ ఆంక్షలు విధించారు. ముడసర్లోవ రోడ్డులో మందుబాబులు, ఆకతాయిలు తిరగకుండా చర్యలు చేపట్టామని ఆరిలోవ సీఐ సోమశేఖర్ తెలిరు. రెండు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్‌లు ఎగరకుండా నిషేధం విధించామన్నారు.