విద్యా వ్యవస్థలో మార్పులు అవసరం | - | Sakshi
Sakshi News home page

విద్యా వ్యవస్థలో మార్పులు అవసరం

Jun 16 2026 7:19 AM | Updated on Jun 16 2026 7:19 AM

ధనిక రాష్ట్రాన్ని

బీఆర్‌ఎస్‌ అప్పులపాలు చేసింది

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

తాండూరు: దేశంలో ప్రస్తుతం అమలవుతున్న విద్యా వ్యవస్థ విద్యార్థులను జీతాలకు పని చేసే బానిసలుగా తయారు చేసేలా ఉందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం తాండూరు పట్టణంలోని హంసా గ్రాండ్‌ కన్వెన్షన్‌లో పట్టణానికి చెందిన వైద్యులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు, విద్యావంతులతో మేధో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్కిల్‌ డవలప్‌మెంట్‌ విద్య లేకపోవడంతో స్వశక్తితో పరిశ్రమలు నెలకొల్పే విధంగా నైపుణ్య విద్య అందడం లేదన్నారు. రాష్ట్రంలో ఇప్పటికి ప్రభుత్వ పాఠశాలలు తీరు మారలేదన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్‌ఎస్‌ అప్పులపాలు చేసిందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు ప్రహ్లాద్‌రావు, మనోహర్‌రావు, డాక్టర్‌ సంపత్‌కుమార్‌, రమేష్‌కుమార్‌, జయప్రసాద్‌, బాలేశ్వర్‌గుప్తా, వీరేందర్‌, మురళీకృష్ణ, సాహు శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

వ్యక్తిగత పనుల పట్ల చిన్నచూపు వద్దు

యాలాల: వ్యక్తిగత పనుల పట్ల కొందరు చిన్నచూపు చూస్తుంటారని, అభివృద్ధి చెందిన దేశాల్లో ఎవరి పనులు వారే చేసుకుంటారని.. ఆ దిశగా మనం కూడా ముందుకు సాగాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పీఎం శ్రీ బాలుర ఉన్నత పాఠశాలలో జేకేఎంఆర్‌ ఆధ్వర్యంలో మరుగుదొడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మన సమాజంలో బడులు, ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నా నిర్వాహణ మాత్రం జరగడం లేదన్నారు. నిర్వాహణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావిస్తే సమస్య ఉండదన్నారు. ఏటా తన కోటా కింద రూ.5 కోట్లు ఉంటాయని, ఆ నిధుల్లో ప్రభుత్వ బడుల అభివృద్ధికి ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు మారాలన్నారు.

కేజీబీవీ, కళాశాల సందర్శన

అనంతరం స్థానిక కేజీబీవీ, కళాశాలను ఎంపీ సందర్శించారు. విద్యార్థుల సంఖ్య, మెనూ అమలుపై కేజీబీవీ ఎస్‌ఓ మంగమ్మను అడిగి తెలుసుకున్నారు. వంట తయారీపై ఆరా తీశారు. ఏ గ్యాస్‌ వాడుతున్నారని ప్రశ్నించగా, డొమెస్టిక్‌ గ్యాస్‌ వాడుతున్నట్లు సిబ్బంది తెలిపారు. ఇందుకోసం నెలకు రూ.3 లక్షలు చెల్లిస్తున్నట్లు ఎంపీకి వివరించారు. కమర్షియల్‌ గ్యాస్‌ వాడొచ్చుగా అని అక్కడే ఉన్న ఎంఈఓ, ఎస్‌ఓకు సూచించారు. త్వరలో భారీ గ్యాస్‌ పొయ్యిలు వస్తాయని, అప్పటి నుంచి కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్లు వాడాలని ఆదేశించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఎన్నికల కన్వీనర్‌ బాలేశ్వర్‌ గుప్తా, జిల్లా కార్యదర్శి యూ రమేష్‌కుమార్‌, తహసీల్దార్‌ గాయత్రి, ఎంపీడీఓ శ్రీనిజ, ఎంఈఓ మహిపాల్‌రెడ్డి, హెచ్‌ఎం సిద్రామేశ్వర్‌, నాయకులు వెంకటేశ్‌, యాదగిరి, రవీందర్‌, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement