తాండూరు రూరల్: ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని జినుగుర్తి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. కరన్‌కోట్ ఎస్‌ఐ వినోద్ రాథోడ్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన తుంగళి జగన్(50) మెకానిక్, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మార్కెట్ కమిటీ డైరక్టర్ అజ్మత్ అలీ పొలంలో పైప్‌లైన్ పనులు చేసేందుకు వెళ్లాడు. పనులు ముగించుకొని తిరిగి వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు జగన్‌కు తగిలి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కరన్‌కోట్ ఏఎస్‌ఐ రాములు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుని భార్య అనసూయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.
కారును ఢీకొన్న లారీ
పరిగి: వెనుక నుంచి కారును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. గురువారం పరిగి పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ ముందు వెళ్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న శాంతకుమార్ స్వల్ప గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
దుకాణంలోకి
దూసుకెళ్లిన కారు
బొంరాస్‌పేట: మండలంలోని రేగడిమైలారంలో జాతీయ రహదారిపై వెళ్తున్న కారు ఓ దుకాణంలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ గులామ్ ఫకాన్ తన కారులో కర్ణాటక రాష్ట్రం గుర్బర్గాకు వెళ్తున్నారు. వాహనం ఉదయం గ్రామంలోని శ్యామలయ్యగౌడ్ కిరాణ దుకాణంలోకి దూసకెళ్లి బోల్తా పడింది. దుకాణాదారు పుష్పమ్మతోపాటు కారులో ఉన్న ఐదురుగురికి కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దెబ్బతిన్న కారును పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
15న జిల్లా సర్పంచుల చైతన్య సదస్సు
కుల్కచర్ల: ఈ నెల 15వ తేదీన జిల్లా సర్పంచుల చైతన్య సదస్సును నిర్వహిస్తారని పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర కార్యదర్శి మందిపల్ వెంకట్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని హరిత రిసార్ట్‌లో జిల్లా సర్పంచుల చైతన్య సదస్సు ఉంటుందని చెప్పారు. సర్పంచుల సమస్యలు, జిల్లా కమిటీ ఏర్పాటుపై చర్చా కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. జిల్లా పరిధిలోని సర్పంచులందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.
యువకుడికి రిమాండ్
కడ్తాల్: ప్రేమ పేరుతో యువతిని వేధిస్తూ అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడిని పోలీసు లు రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన కడ్తా ల్ మండల పరిధిలో చోటుచేసుకుంది. సీఐ సైదిరెడ్డి తెలిపిన ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన మూడ చరణ్ ఓ యువతిని కొంత కాలంగా ప్రేమ పేరిట వేధిస్తూ పెళ్లి చేసుకోవాలని ఒత్తి చేస్తున్నాడు. ఆమెతో అనుచితంగా ప్రవర్తించసాగాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజ రుపరచగా రిమాండ్‌కు తరలించారన్నారు.
నిందితుడిపై కేసు నమోదు
బంజారాహిల్స్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. బాధిత మహిళకు మైలారం ప్రవీణ్‌తో గత పదేళ్లుగా పరిచయం ఉంది. గతంలో ఆమె అతడి ఇంట్లో అద్దెకు ఉండేది. ఏడాది క్రితం వివాహం జరిగినప్పటికీ భర్త వారం రోజులకే వదిలి వెళ్లిపోవడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ సమయంలో ప్రవీణ్ తనకు అండగా ఉంటానని నమ్మకం కల్పించి సన్నిహితంగా మెలిగాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో భోజనం తీసుకుని తన ఇంటికి వచ్చిన బాధితురాలిపై ఇంట్లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. వివాహం చేసుకుంటానని చెప్పడంతో అతని మాటలు నమ్మింది. ఈ నెల 5న మరోసారి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.


