అనంతగిరి: భూ భారతి చట్టం ద్వారా భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. సోమవారం వికారాబాద్ మండలం అత్వెల్లి గ్రామంలో భూ భారతి సర్వేపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిజాం నవాబుల కాలంలో భూముల సర్వే జరిగిందని, మళ్లీ తొంభై ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం భూముల రీ సర్వే చేస్తోందని తెలిపారు. నాటికి నేటికీ టెక్నాలజీ బాగా పెరిగిందని, ఇప్పుడు ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించి భూములను సర్వే చేసి, హద్దులు నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ప్రతి సర్వే నంబర్‌కు మ్యాప్ ఇస్తారన్నారు. ఇదంతా మీ ముందే, మీ అనుమతితోనే జరుగుతుందని పేర్కొన్నా రు. ఈ సర్వేతో మంచి జరుగుతుందని, భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ వివరాలను భూ భారతి పోర్టల్‌లో నమోదు చేస్తాని చెప్పారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా, భూ యజమానుల అభిప్రాయాలను పరిగణనలోకి సర్వే సక్రమంగా చేయాలని అధికారులకు సూచించారు. సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు.
అత్వెల్లి గ్రామంలో ‘అరైవ్ అలైవ్’
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అత్వెల్లి గ్రామంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు భద్రత, డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని రోడ్డు ప్రమాదాలతో అర్ధాంతరంగా ముగించవద్దని, మన రక్షణ మన చేతిలోనే ఉంటుంన్నారు. యువకులు మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతూ కుటుంబ సభ్యులకు దుఃఖాన్ని మిగిల్చుతున్నారన్నారు. అనంతరం రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎస్పీ స్నేహ మెహ్ర, అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, ఆర్‌టీఐ మెంబర్ జాఫర్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, సర్పంచ్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


