తొలి పోరులో హస్తం హవా
పట్టు నిలబెట్టుకున్న అధికార పార్టీ బషీరాబాద్‌లో ‘కారు’ జోరు ఒకటి రెండు స్థానాలకే బీజేపీ పరిమితం పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థుల విజయం
వికారాబాద్: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయ దుందుబి మోగించింది. గురువారం కొడంగల్, తాండూరు నియోజకవర్గాల్లోని 225 జీపీలకు ఎన్నికలు జరిగాయి. బషీరాబాద్ మినహా మిగిలిన ఏడు మండలాల్లో హస్తం పార్టీ హవా కొనసాగింది. కాంగ్రెస్ మద్దతుదారులు అధిక సంఖ్యలో గెలుపొందారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే సొంత మండలం బషీరాబాద్‌లో మాత్రం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కనిపించింది. ఈ మండలంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు చెరో సగం జీపీలు దక్కించుకున్నాయి.
కొడంగల్‌లో కాంగ్రెస్‌కు పట్టం
సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లో అధికార పార్టీ హవా కొనసాగింది. ఫలితాలు దాదాపుగా ఏకపక్షంగా వచ్చాయి. మెజార్టీ జీపీలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. బీఆర్‌ఎస్ ఐదారు జీపీలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏకగ్రీవ జీపీల్లో సైతం కాంగ్రెస్ మద్దతుదారులే ఉన్నారు. ఓవరాల్‌గా కమలం పార్టీ ఒకటి రెండు చోట్లకే పరిమితమైంది. వామపక్ష పార్టీలైన సీపీఎం, సీపీఐలు ఖాతా తెరవలేదు.
‘చే’జిక్కిన పంచాయతీలు 173
పార్టీల వారీగా వివరాలు
మండలం మొత్తంజీపీలు కాంగ్రెస్ బీఆర్‌ఎస్ బీజేపీ స్వతంత్ర
తాండూరు 33 22 11 – –
బషీరాబాద్ 39 21 17 01 ––
యాలాల 39 23 12 01 03
పెద్దేముల్ 38 26 12 –– ––
కొడంగల్ 25 22 – 02
దౌల్తాబాద్ 33 21 11 – 01
బొంరాస్‌పేట్ 35 29 05 – 01
దుద్యాల 20 15 04 – 01
మొత్తం 262 179 72 02 08


