షాద్‌నగర్‌లో గూడుపుఠాణి రాజకీయం
కొత్తూరు: షాద్‌నగర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌తో ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్ గూడుపుఠాణి రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. నందిగామ మండలం మొదళ్లగూడ గ్రామంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజల్లో ఇప్పటికీ ఆదరణ తగ్గలేదని, కేవలం మాజీ ఎమ్మెల్యే తనయులు రవియాదవ్, మురళీకృష్ణయాదవ్‌లు చేసిన అరాచకాల కారణంగానే గత ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైందన్నారు. ఈ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే తనయులు, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందని ఆరోపించారు. అందులో భాగంగానే పార్టీలకు అతీతంగా తమ అభ్యర్థులను గెలిపించుకోవాలనే కుట్రతో సొంత పార్టీ అభ్యర్థులకు అన్యాయం చేస్తున్నారన్నారు. నందిగామ మండలంలో ఓ ట్రస్ట్‌కు సంబంధించిన పొలంలో మాజీ ఎమ్మెల్యే తీరుపై ఆరోపణలు చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్ అదే వ్యవహారంలో చేస్తున్న లీలలు అందరికి తెలుసన్నారు. మాజీ ఎమ్మెల్యే తనయులు చేస్తున్న అరాచకాలకు ఎమ్మెల్యే వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు.
సీఐ క్షమాపణ చెప్పాల్సిందే
నందిగామ సీఐ ప్రసాద్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమ అనుచరులు, వార్డు సభ్యులుగా బరిలో ఉన్న వారిపై దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. మొదళ్లగూడలో శాంతియుత వాతావరణంలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను లాఠీచార్జి చేసి భయోత్పాతంగా సీఐ చేసినట్లు ఆరోపించారు. అకారణంగా దాడి చేసిన వారికి సీఐ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ విషయమై సీఐను వివరణ కోరగా ఓటర్లను వాహనాల్లో తరలించొద్దని మాత్రమే సూచించానని చెప్పారు. గుంపులుగా ఉన్న జనాలను వెళ్లాలనే మాత్రమే చెప్పా, లాఠీచార్జి చేయలేదని వివరించారు.
ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి


