ప్రలోభ పెట్టి.. ప్రాధేయ పడి
● వలస ఓటర్లను ప్రసన్నంచేసుకుంటున్న సర్పంచ్ అభ్యర్థులు
● నిత్యం గ్రామాల్లో మందు,విందులతో సందడి
చేవెళ్ల: ‘నమస్తే అన్నా, అక్కా, తమ్మీ, చెల్లి నేను మన గ్రామ సర్పంచ్‌గా పోటీ చేస్తున్న మీ ఓటు నాకే వేయాలి’ అని వలస ఓటర్లను ప్రసన్నం చేసుకొని పనిలో ఆయా గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు బిజీగా ఉన్నారు. రెండో విడతలో జరుగుతున్న చేవెళ్ల డివిజన్ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ఓటరు జాబితాలో తిరగేసి మరీ ఆరా తీస్తున్నారు. గ్రామంలో ఉన్న ఓటర్లను ఉదయం సాయంత్రం వేళల్లో కలిసి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మండల కేంద్రం, హైదరాబాద్, ఇతర పట్టణాల్లో ఉన్న వారి కోసం వాకబు చేస్తూ ఫోన్ నంబర్లు తీసుకొని, అడ్రస్‌లు కనుక్కొని వారి ఎదుట ప్రత్యేక్షమవుతున్నారు. మన గ్రామంలో సర్పంచ్‌గా పోటీ చేస్తున్నాను. 14వ తేదీన గ్రామానికి వచ్చి ఓటు వేసేందుకు రావాలని తాయిళాలు, వాగ్దానాలు ఇవ్వటంతోపాటు రవాణా సౌకర్యాలు సైతం ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో ఆందోళన పెరిగిపోతుంది. ఓటర్లు ఎక్కడ ఉంటే అక్కడికి పరుగులు తీస్తూ దండాలు పెడుతూ కాళ్లు పట్టుకొని మరీ గెలిపించాలని కోరుతున్నారు. ఊరి బయట ఉండే ఓటర్లకు వారికి తెలిసిన వారితో ఫోన్లు చేయించి ఓట్లు రాబట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరిని మించి మరొకరు ఓటర్లకు మందు, విందులతో దావత్‌లు ఇస్తున్నారు.


