ప్రమాదశాత్తు కార్మికుడి మృతి
● స్టీల్ ఫ్యాక్టరీలో వరుస ఘటనలు
● మృత్యువాత పడుతున్న కార్మికులు
పరిగి: పనిచేస్తున్న చోట ప్రమాదవశాత్తు వలస కార్మికుడి మృత్యువాత పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి లక్ష్మీదేవిపల్లి గ్రామ సమీపంలోని సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో బిహార్ రాష్ట్రానికి చెందిన సుహేల్ అన్సారీ(20) పనిచేస్తున్నాడు. బుధవారం ప్రమాదవశాత్తు మిషనల్ బెల్టులో దుర్మరణం చెందాడు. జరిగిన ఘటనను కర్మాగారం యాజమాన్యం గోప్యంగా ఉంచిందని పలువురు ఆరోపించారు. ఫ్యాక్టరీలో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, నెల రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా ఫ్యాక్టరీని కొనసాగిస్తూ.. శ్రమజీవుల ఉసురు తీస్తున్నారని వాపోయారు. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రమాద విషయమై ఎస్‌ఐ మోహనకృష్ణను వివరణ కోరగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
యాజమాన్యం నిర్లక్ష్యంతో..
నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న స్టీల్ ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం తహసీల్దార్ వెంకటేశ్వరికి సీఐటీయూ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యంతో కార్మికులు బలవుతున్నారన్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఫ్యాక్టరీలోకిఎవరినీ అనుమతించడం లేదని పేర్కొన్నారు. అధికారులు స్పందించి యాజ్యమాన్యంతగిన చర్యలు తీసుకోవాలని కోరారు.


