
భూ తగాదాల్లో జోక్యం వద్దు
● నేరాల అదుపులో సీసీ కెమెరాలదే కీలక పాత్ర ● నవాబుపేట పోలీసుల పనితీరు భేష్ ● ఎస్పీ నారాయణరెడ్డి
నవాబుపేట: నేరాలను అదుపు చేయడంలో సీసీ కెమెరాలు కీలకంగా పనిచేస్తాయని ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం నవాబుపేట పోలీస్ స్టేషన్ ఆయన సందర్శించారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇళ్ల ముందు, షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చొరవ తీసుకోవాలని సూచించారు. చాలామంది నేరస్తులను సీసీ కెమెరాల ద్వారానే గుర్తిస్తున్నట్లు తెలిపారు. రోడ్ల పరిస్థితి బాగులేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. భూ తగాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోరాదని, రెవెన్యూ శాఖ సూచనల మేరకు ముందుకు వెళ్లాలన్నారు. 80 శాతం దొంగతనాలు, దోపిడీలు, ట్రాన్స్ ఫార్మర్ల చోరీలు పాత నేరస్తుల పనేనని పేర్కొన్నారు. వారిపై నిఘా ఉంచామన్నారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా, నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నవాబుపే ట పోలీసుల పనితీరు బాగుందని, ఇంకా మెరుగ్గా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ వెంకటేష్, ఎస్‌ఐ అరుణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.