
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్
కుల్కచర్ల: ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పుట్టపహాడ్ గ్రామానికి చెందిన హరిశ్చందర్ బుధవారం రాత్రి 9 గంటలకు వ్యక్తిగత పని నిమిత్తం తన బైక్‌పై మహబూబ్‌నగర్ వెళ్తున్నాడు. మార్గమధ్యలో గ్రామ శివారు దాటక ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గమనించి 108 అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పరీక్ష కేంద్రాల వద్ద
పటిష్ట నిఘా
చేవెళ్ల: ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు గురువారం నుంచి జరగనున్నాయని, అన్ని కేంద్రాల వద్ద పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని చేవెళ్ల ఎస్‌ఐ వనం విరీష చెప్పారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆదర్శ పాఠశాల, కళాశాలలో ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో హాజరై ప్రశాంతంగా పరీక్షలు రాసుకోవాలని సూచించారు.
అనారోగ్యంతో
యువకుడి ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం రూరల్: అనారోగ్యంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి కథనం ప్రకారం.. స్ఫూర్తి కళాశాల సమీపంలో నాదర్‌గుల్‌లో నివాసం ఉండే మడను అవినాష్(20) అనే యువకుడు కొన్నేళ్ల నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.
వృక్తి అదృశ్యం
యాచారం: హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. పీఎస్ పరిధిలోని కుర్మిద్ద గ్రామానికి చెందిన మల్కాపురం నర్సింహ(50) ఈ నెల 7న పని కోసం వెళ్తున్నానని చెప్పి ఇంటికి తిరిగి రాలేదు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు చుట్టు పక్కల గ్రామాలు, బంధువుల ఇళ్ల వద్ద వెతికారు. అయినా జాడలేదు. దీంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లిక్కి కృష్ణంరాజు తెలిపారు.
విద్యుదాఘాతంతో
పాడి ఆవు మృతి
కడ్తాల్: విద్యుదాఘాతంతో పాడి ఆవు మృత్యువాత పడిన సంఘటన మండల పరిధిలోని పుల్లేర్‌బోడ్‌తండాలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. తండాకు చెందిన నేనావత్ గోపాల్‌నాయక్‌కు ఉన్న పాడి ఆవు మేత మేసుకుంటూ పక్క పొలంలోని ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లింది. దీంతో విద్యుత్ తీగకు తగలడంతో అక్కడికక్కడే మృత్యువాత పడినట్లు బాధిత రైతు తెలిపారు. ఆవు విలువ రూ.లక్ష ఉంటుందని, తనను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.