
డాక్టర్ లేని దవాఖాన
ధారూరు: ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లా.. శాసనసభాపతి నియోజకవర్గంలోని ఓ ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు అందని ద్రాక్షలా మారాయి. డాక్టర్లు, ఏఎన్‌ఎంలు డిప్యూటేషన్లపై వెళ్లిపోవడం.. ఖాళీ స్థానాల్లో ఎవరినీ నియామకం చేయక పేదలు ఇబ్బంది పడుతున్నారు.
అదనపు బాధ్యతలకు వెనుకడుగు
మండల పరిధిలోని నాగసమందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆరు నెలల క్రితం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రి ఆర్‌ఎంఓగా పనిచేసిన బదిలీపై వచ్చారు. ఇటీవల ఆమె తనకున్న పలుకుబడితో చర్లపల్లి జైలు ఆస్పత్రికి బదిలీ చేయించుకున్నారు. ఆమె స్థానంలో ధారూరు పీహెచ్‌సీ డాక్టర్ శాంతికి అదనపు బాధ్యతలు అప్పగించారు. అక్కడే పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌ఓ) విధులకు సరిగా హాజరుకాకపోవడం సరికాదని చెప్పడంతో ఆయన డీఎంహెచ్‌ఓతో డాక్టర్ శాంతికి చీవాట్లు పెట్టించినట్లు తెలిసింది. దీంతో మోమిన్‌కలాన్ సబ్ సెంటర్‌లో పనిచేస్తున్న ఎంఎల్‌హెచ్‌పీ స్వాతిని నాగసమందర్‌కు పంపడంతో ఆమె రెండు రోజులు విధులు నిర్వహించి విరమించుకున్నారు. అనంతరం కోట్‌పల్లి పీహెచ్‌సీ డాక్టర్ మేఘనకు శనివారం నాగసమందర్ పీహెచ్‌సీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆమె బాధ్యతలు స్వీకరించకుండానే విముఖత చూపినట్లు తెలుస్తోంది. పీహెచ్‌సీలో వైద్య సేవలు అందుతాయా లేదా అని రోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఈ పీహెచ్‌సీలో డాక్టర్, స్టాఫ్ నర్స్, ఫార్మాసిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మాజీ వైస్ ఎంపీపీ మల్లికార్జున్, కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌చార్జి ప్రకాశ్ పేర్కొన్నారు.
డిప్యూటేషన్‌పై వెళ్లిపోయిన ఏఎన్‌ఎంలు
నాగసమందర్‌లో పనిచేస్తున్న ఏఎన్‌ఎంను తాండూర్ మండలం జిన్‌గుర్తి పీహెచ్‌సీకి, తరిగోపుల ఏఎన్‌ఎంను రామయ్యగుడ పీహెచ్‌సీకి, కేరెళ్లి ఏఎన్‌ఎంను, కేరెళ్లి పల్లె దవాఖానలో పనిచేస్తున్న ఎంఎల్‌హెచ్‌పీని నాగసమందర్ పీహెచ్‌సీకి, కుక్కింద సబ్‌సెంటర్‌లో మూడు పోస్టులు ఖాళీ అయ్యాయి. పల్లె దవాఖాన డాక్టర్‌ను బలవంతంగా బదిలీ చేసి మరో పల్లె దవాఖానకు పంపగా.. సెకండ్ ఏఎన్‌ఎం ధారూరుకు, మొదటి ఏఎన్‌ఎం జిన్‌గుర్తికి డిప్యూటేషన్‌పై పంపారు. ప్రస్తుతం ఆయా సబ్‌సెంటర్లలో ఏఎన్‌ఎంలు లేక వైద్య సేవలు కరువయ్యాయి.
ఏఎన్‌సీ సేవలకు బ్రేక్
ప్రతీ బుధవారం చిన్న పిల్లలకు, గర్భిణులకు టీకా వేయాల్సి ఉంటుంది. ప్రతీ శనివారం సబ్‌సెంటర్ల పరిధిలోని గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు అందించా ల్సి ఉంటుంది. దీంతో పాటు రక్త నమూనాల సేక రణ సేవలు నిలిచిపోయానని రోగులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులను ప్రశ్నించేవారే కరువయ్యారని విచారం వ్యక్తం చేస్తున్నారు. వైద్య సేవలు సరిగా అందక ఆర్‌ఎంపీ డాక్టర్లను ఆశ్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఈ వి షయంలో చొరవ తీసుకుని నాగసమందర్ పీహెచ్‌సీలో డాక్టర్ నియమించడంతో పాటు ఏఎన్‌ఎంల కు ఇచ్చిన డిప్యూటేషన్ ఆర్డర్లు రద్దు చేయించి తిరిగి ఆయా సబ్‌సెంటర్లకు రప్పించాలని కోరుతున్నారు.
పెద్దల ఇలాకాలో పేదలకు అందని వైద్యం
నాగసమందర్ పీహెచ్‌ఎస్‌లో డాక్టర్, నాలుగు ఏఎన్‌ఎం పోస్టులు ఖాళీ
డిప్యూటేషన్ల పేరిట బదిలీలు
ఇన్‌చార్జిలుగా వెళ్లేందుకు విముఖత చూపుతున్న వైద్యులు