
ప్రతి గింజనూ కొనుగోలు చేయాలి
తుర్కయంజాల్: రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్ డిమాండ్ చేశారు. పురపాలక సంఘం పరిధిలోని తొర్రూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం వారు పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం కొనుగోళ్లను వేగవంతం చేయకపోవడంతో దళారులకు క్వింటా రూ.1,700 రైతులు అమ్ముకుని రూ.600 నష్టపోతున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు కరువయ్యాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు నోముల దయానంద్ గౌడ్, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బోసుపల్లి ప్రతాప్, ఎస్సీ మోర్చా రాష్ట్ర కోశాధికారి బచ్చిగళ్ల రమేష్, మున్సిపాలిటీ అధ్యక్షుడు ఎలిమినేటి నర్సింహా రెడ్డి, నాయకులు కందాల బల్‌దేవ్ రెడ్డి, పోరెడ్డి అర్జున్ రెడ్డి, కొత్త రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.