
ఏరువాక పౌర్ణమి వరకు..
తాండూరు రూరల్: తెలంగాణ–కర్ణాటక సరిహద్దులోని కోత్లాపూర్ శివారులో రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర ప్రారంభమైంది. ఈ ఉత్సవాలు జూన్ 11న ఏరువాక పౌర్ణమి వరకు కొనసాగుతాయి. భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న అమ్మవారి జాతరకు రాష్ట్రంలోని ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ తోపాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారికి దర్శించుకుంటారు. ప్రతీ శుక్రవారం, మంగళవారం భక్తులు బోనంతో నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. నూతన దంపతులు అమ్మవారి సమక్షంలో ఒడిబియ్యం పోసుకుంటారు.
ఆలయ చరిత్ర
మండల పరిధిలోని కోత్లాపూర్‌లో వెలిసిన రేణుక ఎల్లమ్మ ఆలయానికి 850 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు గ్రామస్తులు చెప్పారు. గ్రామానికి చెందిన రాళ్ల రాగిరెడ్డి తన పొలంలో గుంటుకతో పొలంను చదును చేస్తుండగా.. ఓ రాయి గుంటుకకు అడ్డు తగిలింది. వెంటనే ఆ రాయిని గుంటుక మీద పెట్టి పొలంలో మరల చదును చేస్తుంటే తిరిగి అదే స్థలంలోకి వెళ్లింది. రెండు మూడు సార్లు అలాగే జరిగింది. ఓ రోజు రాత్రి రాగిరెడ్డి నిద్రిస్తుండగా ఎల్లమ్మ తల్లి కలలోకి వచ్చి గుంటుకకు అడ్డు వచ్చిన రాయిని తానేనని.. అక్కడ ఆలయం నిర్మించాలని చెప్పింది. దీంతో అక్కడ గుడి నిర్మించి పూజలు చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
ఆలయాభివృద్ధికి పాటుపడిన కర్ణాటక మాజీ మంత్రి
కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన మాజీ విద్యాశాఖ మంత్రి అరవింద్ లింబావళి ఇళవేళ్పు కోత్లాపూర్ రేణుకా ఎల్లమ్మ తల్లి. అమ్మవారి దయతోనే తాను రాజకీయంగా రాణించాలని చిన్న గుడిలా ఉన్న రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని కోట్లాది రూపాయలు వెచ్చించి ఆలయాభివృద్ధి చేశాడు. ప్రతీ ఏడాది రెండు మూడు సార్లు అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. ప్రస్తుతం ఉత్సవాలకు ఆలయ ప్రాంగణంలో బండలు, రంగులు వేయించారు. 2001 నుంచి ఈ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లింది.
30న ప్రధాన ఘట్టం
ఈ నెల 30వ తేదీ శుక్రవారం సాయంత్రం 4.30గంటలకు జాతరలో ప్రధాన ఘట్టమైన రథోత్సవం, సిడే ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మొలకల పౌర్ణమికి ప్రారంభమైన ఈ జాత ఏరువాక పౌర్ణమితో ముగుస్తుంది.
పోలీసు బందోబస్తు
జాతర సందర్భంగా కరన్‌కోట్ ఎస్‌ఐ విఠల్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. రథోత్సవం, సిడే ఊరేగింపు సందర్భంగా నియోజకవర్గంలోని సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుళ్లతో భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. జినుగుర్తి పీహెచ్‌సీ తరుపున వైద్య సాదుపాయం కల్పిస్తున్నారు.
ఏర్పాట్లు పూర్తి
భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ చైర్మన్ నవీన్‌రెడ్డి, ఈఓ శేఖర్‌గౌడ్ తెలిపారు. భక్తులు వంటలు చేసుకునేందుకు ప్రత్యేక షెడ్లతో పాటు తాగునీటి సౌకర్యం కల్పించామన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసి నిత్యం పర్యవేక్షిస్తున్నామని వివరించారు.. గ్రామస్తుల సహకారంతో జాతర వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు.
రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర
30న రథోత్సవం, సిడే
ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయాధికారులు

ఏరువాక పౌర్ణమి వరకు..