
హెచ్‌ఐవీ మృతులకు కొవ్వొత్తులతో నివాళి
తాండూరు టౌన్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్‌ఐవీ ఎయిడ్స్ (దిశ) ఆధ్వర్యంలో తాండూరు ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది హెచ్‌ఐవీ మృతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ నివాళులర్పించారు. ప్రతి ఏటా మే 3వ ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా హెచ్‌ఐవి మృతులకు నివాళులర్పిస్తూ అంతర్జాతీయ కొవ్వొత్తుల స్మారక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి నుంచి ఇందిరాచౌక్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం దిశ క్లినికల్ సర్వీసెస్ ఆఫీసర్ జి రమేశ్ మాట్లాడుతూ మనం గుర్తుంచుకుంటాం, మనం లేచి నిలుస్తాం, మనం మార్గదర్శకులు అవుదాం, హెచ్‌ఐవీ రోగుల పట్ల వివక్ష మానుకుందాం, వారిని సైతం అందరితో సమానంగా చూద్దాం అనే థీమ్‌తో ప్రజలంతా వారికి మద్దతు ఇవ్వాలన్నారు. ఆస్పత్రుల్లో హెచ్‌ఐవీ రోగుల కోసం ఉచితంగా మందులు అందజేస్తున్నారన్నారు.