
ఫీజు బకాయిలు విడుదల చేయాలి
ఆమనగల్లు: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో భాగంగా బకాయిలు విడుదల చేయకపోవడంతో లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని టీఎస్‌ఎస్‌ఓ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బకాయి ఉన్న దాదాపు రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆమనగల్లు పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలు చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఓటీఎస్ కింద సెటిల్‌చేసి విద్యాసంవత్సరం ప్రారంభంలోనే చెల్లిస్తామని గతంలో సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. వెంటనే బకాయిలు చెల్లించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. సమావేశంలో టీఎస్‌ఎస్‌ఓ నాయకులు వంశీ, సుదర్శన్, చిక్కి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.