
సారం లేక.. దిగుబడి రాక
పరిగి: రైతులు అధిక పంట దిగుబడి సాధించేందుకు పోటీ పడి ఎరువులు వేస్తున్నా నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. భూమిలో పోషక లోపాలు గుర్తించకుండా.. వేసిన పంటలే వేయడం, అధిక మోతాదులో ఎరువులు చల్లడం వల్ల పంటలపై చీడపీడల దాడి అధికమై సస్యరక్షణ ఖర్చు పెరుగుతోంది. భూములు నిస్సారమై భవిష్యత్‌లో పంటలు వేయడానికి పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. నేలలో అంతర్లీనంగా ఉన్న పోషకాలను కాపాడుకోవాలి. భూసారం తెలుసుకోకుండా ఎలాంటి పంటలు సాగు చేసినా దిగుబడి లేక ఆర్థికంగా చతికిల పడాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. మరో నెల రోజుల్లో ఖరీప్ సీజన్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం భూసార పరీక్షలు చేయడానికి మట్టి నమూనాల సేకరణకు అనుకూలమైన సమయం. వానాకాలం పంటలు విత్తుకునే సమయానికి ఫలితాలు వస్తే అందుకు అనుగుణంగా విత్తనం, ఎరువులు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది భూసార పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు.
అన్నదాతలపై భారం
పరిగి నియోజకవర్గంలో ఐదు మండలాల్లో 1,32,000 ఎకరాల సాగు భూములున్నాయి. ఇందులో నల్లరేగడి, ఎర్రమట్టి, ఇసుక, చౌడు నేలలు ఉన్నాయి. జిల్లాలో అన్ని రకాల పంటలకు అనుకూలమైన నేలలు ఉన్నా రైతులు అధికంగా పత్తి, వరి, మొక్కజొన్నలనే సాగు చేస్తున్నారు. నేల స్వభావం తెలియకుండా అధిక దిగుబడుల కోసం ఎరువులు, క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్నారు. పంటకు ఏ మేరకు ఎరువులు అవసరమో రైతులకు అవగాహన ఉండాలి. భూమిలో ఏయో పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకోవాలంటే భూసార పరీక్షల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మట్టి పరీక్షలు నిర్వహిస్తే పోషక లోపాలను గుర్తించవచ్చు. తద్వారా మోతాదులో రసాయన ఎరువులు వాడితే అనవసర ఖర్చు తగ్గించుకోవచ్చు. భూసారాన్ని కాపాడుకుంటూ నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు.
పోషక సమతుల్యత ముఖ్యం
పంటలు భూమిలోని పోషకాలను ఏ మేరకు ఉపయోగించుకుంటాయో దానిపై దిగుబడులు ఆధారపడి ఉంటాయి. పోషకాలు ఎక్కువైనా ఆశించిన దిగుబడులు రావు. సాధారణంగా రైతులు భాస్వారం, పొటాష్ ఎరువులను మోతాదు కంటే తక్కువగాను, నత్రజని ఎరువును మోతాదుకంటే రెండు, మూడు రేట్లు ఎక్కువగాను వేస్తుంటారు. దీనివల్ల పోషకాల సమతుల్యత దెబ్బతింటుంది. నత్రజని ఎరువును అధిక వినియోగం వల్ల పంట విపరీతంగా ఎదుగీత పడిపోతుంది. పూత ఆలస్యంగా రావడం, గింజలు ఎక్కువగా తాలురావడం వంటివి ఉంటాయి. పంట చీడపీడలకు సులభంగా లోనవుతుంది. చివరికి రైతు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఏ పంటకు ఏ పోషక పరిమాణంలో అవసరమో తెలుసుకుని తగిన మోతాదులో అందించడాన్నే పోషక సమతుల్యత అంటారు. ఇది భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులను వాడవచ్చు.
ఆదేశాలు అందాయి
మండలంలో 225 మంది రైతుల నుంచి భూసార పరీక్షలు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. రెండు స్కీంల ద్వారా భూసార పరీక్షలకు వీలుంది. మండలంలోని అన్ని గ్రామాల్లో పరీక్షలు చేయాలని ఎలాంటి సూచనలు అందలేదు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే నిర్వహిస్తాం. – డీఎస్ లక్ష్మీకుమారీ, ఏడీఏ, పరిగి
భూసార పరీక్షలు చేయక రైతుల ఇబ్బందులు
సరైన మోతాదులో పంటకు అందని పోషకాలు