
తాగునీటి తండ్లాట!
తాండూరు రూరల్: తాగునీరు లేక గొంతెండుతుందని మండలంలోని సంకిరెడ్డిపల్లి గ్రామస్తులు విలపిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు అవుతున్నా నేటికి గ్రామాల్లో తాగునీటి సరఫరా సక్రమంగా లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెండు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో గొంతు తడిపేందుకు తండ్లాడుతున్నారు. సంకిరెడ్డిపల్లి గ్రామం, సంకిరెడ్డిపల్లి తండా ఉన్నాయి. రెండు గ్రామాలు కూడా తెలంగాణ–కర్ణాటక సరిహద్దు అటవీ ప్రాంతంలో ఉంటాయి. వేసవికాలం వచ్చిందంటే చాలు గ్రామస్తులు, గిరిజనులకు కంటిమీది కునుకు లేకుండా పోతుంది. సాంకేతిక సమస్యలతో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిందంటే చాలు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నేళ్లుగా ఇదే తంతు జరుగుతున్నా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.
మిషన్ భగీరథ నీరే దిక్కు
ప్రస్తుతం మిషన్ భగీరథ ట్యాంకుల నుంచి నీటి సరఫరా అవుతుంది. ప్రతి రోజు సంకిరెడ్డిపల్లి గ్రామానికి 60 వేల లీటర్లు, తండాకు 40 వేల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే మిషన్ భగీరథ సరఫరా నిలిచిపోతే గ్రామస్తులు, తండావాసులకు ప్రత్యామ్నాయంగా నీటి సౌకర్యం లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. దీంతో గ్రామంలోని ఊరడమ్మ దేవాలయం వద్ద సింగిల్ ఫేజ్ మోటారు ఉన్నా సరిపోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు వ్యవసాయ బోరు మోటార్ల వద్ద నుంచి గ్రామ పంచాయతీ ట్యాంకర్‌తో దాహార్తి తీర్చుతున్నారు. ప్రస్తుతం వేసవికాలంలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు, తండావాసులు వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తాగునీటి సరఫరా అయ్యేలా చూడాలని కోరుతున్నారు. క
ొత్త బోరు వేస్తున్నాం
సంకిరెడ్డిపల్లిలో తాగునీటి సమస్య ఉంది. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆదేశాల మేరకు తండాలో వారం క్రితం బోరు వేశాం. కానీ నీళ్లు ఆశించిన స్థాయిలో రాలేదు. అందుకే మరో కొత్త బోరు వేస్తున్నాం. ఎస్‌డీఎఫ్ నిధులు రూ.5 లక్షలతో బోరువేసి, ట్యాంక్‌లకు కొత్త పైప్ లైన్ ఏర్పాటు చేస్తాం. దీంతో ప్రజలకు తాగునీటిని అందిస్తాం.
– ప్రణయ్, ఏఈ, ఆర్‌డబ్ల్యూఎస్, తాండూరు
నిలిచిన మిషన్ భగీరథ సరఫరా
సంకిరెడ్డిపల్లిలో అవస్థలు పడుతున్న గ్రామస్తులు