
కల్లాల్లేక.. రోడ్లపైనే వడ్లు!
స్థానికం
దౌల్తాబాద్: మండలంలోని పలు గ్రామాల్లో రోడ్లపై పోసిన ధాన్యం కుప్పలతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. పంటను ఆరబెట్టుకునేందుకు కల్లాలు లేకపోవడంతో రైతులు తారు రోడ్లను ఆశ్రయిస్తున్నారు. చేతికొచ్చిన పంట దిగుబడుల్లో తేమ శాతం తగ్గించుకునేందుకు ధాన్యం ఆరబెడుతున్నారు. రోజుల తరబడి వడ్ల కుప్పలు ఉండడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. గతంలో ప్రమాదాలు సంభవించిన సంఘటనలున్నాయి. ఏటా సీజన్ రాగానే రైతులు రోడ్లపై ఇరువైపులా పంట కుప్పలు పోయడంతో రహదారులు కల్లాలుగా మారాయి. రోడ్లపై ధాన్యం ఆరబోయడంతో రాత్రి పూట వాహనదారులు అదుపుతప్పి కింద పడుతున్నారు.
కలగానే కల్లాలు
గతంలో ఉపాధి హామీ పథకంలో ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం, బీసీలకు 90శాతం సబ్సీడీపై కల్లాల నిర్మాణానికి దరఖాస్తులను స్వీకరించింది. కొన్ని గ్రామాల్లో పూర్తయినా బిల్లులు రాలేదని కొన్ని అసంపూర్తిగానే మిగిలిపోయాయయని రైతులు వాపోతున్నారు. మూడేళ్లుగా కల్లాల పథకం నిలిచిపోవడంతో అర్హులైన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు గ్రామీణుల కష్టాలు గుర్తించి పథకాన్ని పునరుద్ధరిస్తే మేలు జరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
గుముడాల వెళ్లే దారిలో ధాన్యం కుప్ప
అవస్థలు పడుతున్న వాహనదారులు