
యువకుడి బలవన్మరణం
హిమాయత్‌నగర్ : ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బాల్యతండాకు చెందిన ధరావత్ రాందాస్ కుమారుడు ధరావత్ ప్రవీణ్ కుమార్(20) నారాయణగూడలోని అభ్యశ్రీ బాయ్స్ హాస్టల్‌లో ఉంటూ జేఈఈ మెయిన్స్‌కు కోచింగ్ తీసుకుంటున్నాడు. రెండుసార్లు ప్రయత్నించినా ర్యాంక్ రాకపోవడంతో మనస్తాపానికి లోనైన అతను ఈనెల 12న తల్లిదండ్రులకు ఫోన్ చేసి బాధపడగా వారు అతడికి సర్దిచెప్పారు. మంగళవారం తల్లిదండ్రులు ప్రవీణ్‌కు ఫోన్ చేయగా అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆందోళనకు గురైన వారు బుధవారం ఉదయం హాస్టల్‌కు వెళ్లి చూడగా ప్రవీణ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.