
రైతుకు ‘గుర్తింపు’
దౌల్తాబాద్: రైతు(ఫార్మర్) రిజిస్ట్రీ అమలు ప్రక్రియను వ్యవసాయ అధికారులు ప్రారంభించారు. ఆధార్‌తో ప్రతి అన్నదాతకు 11 నంబర్లతో యూనిక్‌కోడ్(యూసీ) కేటాయించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయాలన్న సంకల్పంతో కేంద్రం రూపొందించిన ఫార్మర్ ఐడీ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 5న శ్రీకారం చుట్టింది. మండల వ్యాప్తంగా ఉన్న భూ యజమానులకు విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేయనున్నారు. వారికి ఉన్న భూమి రకం, సాగు, వ్యక్తిగత వివరాలను డిజిటల్ రూపంలో పొందుపర్చనున్నారు.
రైతులకు డిజిటల్ కార్డు
ఫార్మర్ ఐడీ ప్రాజెక్టు కింద అర్హులైన ప్రతీ రైతుకు 11 నంబర్ల యూనిక్ ఐడీ కేటాయిస్తున్నారు. ఇది వారికి అందించే డిజిటల్ గుర్తింపు కార్డు. ఆధార్‌తో లింకు అయి ఉంటుంది. ఈ 11 అంకెల ఐడీలో రైతు పేరు, ఆధార్, మొబైల్ నంబరు, పట్టాదారు పాసు పుస్తకం వివరాలు, భూమి రకం, సర్వే నంబర్లు, సాగు చేసిన పంటల తదితర సమాచారం నమోదు చేస్తారు. ఈ ఐడీ ద్వారా రైతు సాగు వివరాల చిట్టా అంతా ఒకే క్లిక్‌తో తెలుసుకోవచ్చు. కేంద్రం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి, ఫసల్ బీమా యోజన వంటి పథకాలకు ఇది తప్పనిసరి కానుంది. ప్రస్తుతం భూ యజమానులకే మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రీ జరుగుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పథకాలు పొందాలంటే భూ యజమానులు తప్పనిసరిగా ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేయాల్సిందే. కాగా తమకు అవకాశం ఇవ్వలేదని కౌలు రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ప్రయోజనాలెన్నో
ప్రతీ రైతుకు జారీ చేసే యూనిక్ ఐడీకి ఆయా రైతులు సీజన్‌లో పొందే సబ్సీడీలు, రుణాలు పంటబీమా వంటి పథకాలను అనుసంధానం చేస్తారు. పంటలకు కనీస మద్దతు ధర పొందేందుకు ఈ ఐడీ ఉపకరిస్తుంది. ఈ ఐడీ సాయంతో దేశంలో ఎక్కడి నుంచైనా రైతుల రుణ అర్హత, బకాయిలు ప్రభుత్వ పథకాల జమ వంటి వివరాలను క్షణాల్లో తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఫార్మర్ ఐడీ ద్వారా కేంద్ర పథకాల ప్రయోజనాలు వేగంగా పారదర్శకంగా అందుతాయి. ప్రకృతి విపత్తుల సమయంలో ఐడీ నంబర్ ఎంటర్ చేస్తే రైతు సాగు వివరాలు తెలుస్తాయి.
మండలంలో ఫార్మర్ రిజిస్ట్రీ ప్రారంభం
11 అంకెలతో ఫార్మర్ ఐడీ కేటాయింపు