
కల్తీ సరుకుల తరలింపు
తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న పోలీసులు
కొడంగల్ రూరల్: కల్తీ సరుకులతో వెళ్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో మంగళవారం రాత్రి తనిఖీ చేస్తున్న క్రమంలో హైదరాబాద్ నుంచి రావులపల్లి వైపు వెళ్తున్న వాహనంలో అక్రమంగా 1500 కేజీల అల్లం పేస్ట్, 1500 లీటర్ల మంచినూనెను తరలిస్తున్నారని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బుధవారం సరుకులను పరిశీలించగా అవి దుర్వాసన కలిగి ఉన్నాయని తెలిపారు. ఎస్‌ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
భూ బాధితులకు
పరిహారం చెల్లించండి
పీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్
తాండూరు టౌన్: తాండూరు బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రజల నుంచి తీసుకున్న భూములకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.శ్రీనివాస్ బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో బైపాస్ రోడ్డు కోసం అంతారం, కోకట్ తదితర ప్రాంతాల పరిధిలో భూసేకరణ చేసి బాధితులకు నష్టపరిహారం చెల్లించలేదన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం భూమి కోల్పోయిన వారికి పరిహారం చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని, లేకపోతే ఈనెల 19వ తేదీన సీపీఎం ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
చెరువులో మునిగి వ్యక్తి మృతి
చేపలు పట్టేందుకు వెళ్లిన
ఒడిశావాసి దుర్మరణం
అనంతగిరి: చేపలు పట్టేందుకు వెళ్లిన వెళ్లిన వ్యక్తి చెరువులో పడి మృతిచెందాడు. సీఐ భీంకుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్ బిష్టుపూర్‌కు చెందిన సుశాంత్ మంగరాజ్(47) శివారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాడు. ఈనెల 12న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. తెలిసిన వారివద్ద వెతికినా ఆచూకీ దొరకలేదు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో శివారెడ్డిపేట చెరువులో గుర్తుతెలియని శవం ఉందని తెలియడంతో అక్కడికి వెళ్లిన కుటుంబ సభ్యులు సుశాంత్‌గా గుర్తించారు. మృతుని కుమారుడు రాకేశ్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నామని సీఐ తెలిపారు.
‘పోలీసులతో ప్రాణభయం’
హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన బాధితుడు
మొయినాబాద్: ‘పోలీసులతో నాకు ప్రాణభయం ఉంది.. భూ వివాదంలో తలదూర్చి దగ్గరుండి ప్రీ కాస్ట్ గోడను తొలగించారు. అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు నాపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు’ అని నాగిరెడ్డిగూడకు చెందిన సంతపురం అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం మీడియాకు వెల్లడించారు. తన తండ్రి నుంచి వారసత్వంగా రావాల్సిన భూమిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించానన్నారు. దీంతో తనకు సగం వాటా ఇస్తూ 2024 జూన్ 6న కోర్టు ఫైనల్ డిక్రీ ఇచ్చిందని తెలిపారు. దీని ప్రకారం 2025 మార్చి 13న కొత్త పట్టాదారు పాసుపుస్తకం వచ్చిందన్నారు. కోర్టు ద్వారా వచ్చిన భూమి చుట్టూ నెల రోజుల క్రితం ప్రీకాస్ట్ వాల్ నిర్మించుకున్నామన్నారు. ఏప్రిల్ 21న అర్ధరాత్రి సుమారు 30 మంది పోలీసులు, కొంత మంది వచ్చి గోడను ధ్వంసం చేశారని, తనపై తప్పుడు కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారని వివరించారు. పోలీసుల తీరును తప్పుపడుతూ జడ్జి మందలించడంతో 41 నోటీసులు ఇచ్చి పంపించారని తెలిపారు. ఇటీవల మళ్లీ పోలీస్ స్టేషన్‌కు రావాలంటూ వేధిస్తున్నారన్నారు. ఇది భరించలేక మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశానని తెలిపారు. దీనిపై మొయినాబాద్ ఇన్‌స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డిని వివరణ కోరగా.. భూమిని కొనుగోలు చేసిన వారు ఇరవై ఏళ్లుగా కబ్జాలో ఉన్నారని, వారు నిర్మించిన ప్రహరీ, చెట్లను ధ్వంసం చేయడంతో వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.

కల్తీ సరుకుల తరలింపు