
దారి కాసిన మృత్యువు
అనంతగిరి: ప్రమాదంలో దెబ్బతిన్న డీసీఎం ఆ యువకుడి పాలిట యమపాశమైంది. ఆగి ఉన్న వాహనాన్ని గమనించక బైక్‌తో ఢీకొని దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాద సంఘటన వికారాబాద్ మున్సిపల్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని హైదరాబాద్ రోడ్డులోని కొత్రెపల్లి సమీపంలో రాత్రి 11 గంటలకు ఓ కారు, డీసీఎం ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు దెబ్బతినడంతో అక్కడే వదిలి పెట్టారు. డీసీఎం కొంతభాగం రోడ్డుపైనే నిలిపారు. గంట వ్యవధిలోనే నవాబుపేట మండలం ఎక్‌మామిడికి చెందిన కార్తీక్ ముదిరాజ్ తన బుల్లెట్ బండిపై మన్నెగూడ వైపు వెళ్తున్నారు. కాగా కొత్రెపల్లి సమీపంలో ఆగి ఉన్న డీసీఎంను గమనించక పోవడంతో వెనుకవైపు నుంచి బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కార్తీక్ తలకు తీవ్ర గాయాలై కొట్టు మిట్టాడుతూ మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భీంకుమార్ తెలిపారు. ఇదిలా ఉండగా ముందుగా జరిగిన ప్రమాదంలో వాహనాన్ని రోడ్డుపై నిలపడంతోనే ఈ ఘోరంజరిగిందని స్థానికులు వాపోతున్నారు.
డీసీఎంను ఢీకొని యువకుడి దుర్మరణం