
సత్యసాయి సేవాకేంద్రంలో ఉచిత ‘స్పోకెన్ ఇంగ్లిష్’
కేంద్రం వ్యవస్థాపకుడు వెంకట్‌రెడ్డి
పరిగి: శ్రీసత్యసాయి సేవాకేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రంగాపూర్ శ్రీసత్యసాయి సేవాకేంద్రం వ్యవస్థాపకుడు సోలిపేట వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత యువత కోసం మంగళవారం ఉచిత స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో ఆంగ్ల భాష తప్పనిసరిగా మారిందన్నారు. గ్రామీణ విద్యార్థులు ఆంగ్లంలో వెనుకబడి ఉన్నారన్నారు. వారికి ఆంగ్ల భాషపై పట్టు పెంచేందుకే తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
తాండూరు టౌన్: రైలు కిందపడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన తాండూరు, రుక్మాపూర్ రైల్వే స్టేషన్ల మధ్య చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సోమవారం అర్ధరాత్రి ముంబాయి ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం వచ్చిందన్నారు. సదరు వ్యక్తి వయసు 50 ఏళ్లకు పైబడి ఉంటుందని, ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నామన్నారు. ఈ మేరకు గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకున్నట్లు చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించామన్నారు. మృత దేహాన్ని గుర్తు పట్టిన వారు 87125 13854 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని రైల్వే పోలీసులు కోరారు.
ఇసుక టిప్పర్ పట్టివేత
యాలాల: ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఓ టిప్పర్‌ను యాలాల పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎస్‌ఐ గిరి తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి విధుల్లో భాగంగా కానిస్టేబుళ్లు జగదీష్, నరేష్ గస్తీ నిర్వహి స్తున్నారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి బాగాయిపల్లి శివారులో గల పౌల్ట్రీ ఫారం సమీపంలో ఇసుక లోడ్‌తో ఓ టిప్పర్ వెళుతుండగా గమనించి పట్టుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పీఎస్‌కు తరలించారు. కానిస్టేబుళ్ల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
నన్ను క్షమించు అన్నయ్య
మనస్తాపంతో యువకుడి బలవన్మరణం
బంట్వారం: కుటుంబ కలహాలతో వేర్వేరుగా తన అన్నావదినలు ఉండడంతో అవమానంగా భావించిన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం బంట్వారం మండలంలోని తొర్మామిడిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీశైలం యాదవ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తొర్మామిడికి చెందిన పోచారం గోవర్ధన్‌రెడ్డి (32)కు వివాహం కాలేదు. వ్యవసాయం చేస్తూ తల్లితో కలిసి ఉండేవాడు. తన అన్న నర్సింహారెడ్డి నగరంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. కుటుంబ కలహాలతో నర్సింహారెడ్డి, భార్య నవనీత దూరంగా ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. ‘వదిన తీరుతో కుటుంబం పరువు పోతోంది.. నన్ను క్షమించు అన్నయ్య’ అంటూ సూసైడ్ నోట్ రాసి పొలం దగ్గర చెట్టుకు ఉరి వేసుకుని గోవర్ధన్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం జరిపించినట్లు ఎస్‌ఐ చెప్పారు.

సత్యసాయి సేవాకేంద్రంలో ఉచిత ‘స్పోకెన్ ఇంగ్లిష్’

సత్యసాయి సేవాకేంద్రంలో ఉచిత ‘స్పోకెన్ ఇంగ్లిష్’