
అభివృద్ధి పనులకు భూమిపూజ
బొంరాస్‌పేట: ముఖ్యమంత్రి నియోజకవర్గంలోని ప్రతి పల్లె, తండాల్లోని వీధులన్నీ పరిశుభ్రంగా మారుతున్నాయని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని తుంకిమెట్లలో సీఆర్‌ఆర్ నిధులు రూ.20 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజ్‌ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. రానున్న వర్షాకాలంలో పారిశుద్ధ్యం లేకుండా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సిములుగౌడ్, నాయకులు జయకృష్ణ, వెంకట్రాములుగౌడ్ రాంచంద్రారెడ్డి, మల్లేశం, మల్లికార్జున్, అంజిల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రోడ్డుపై విరిగిపడిన చెట్టు
మోమిన్‌పేట: మోమిన్‌పేటలో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షానికి రోడ్డుపై చెట్టు విరిగిపడింది. మోమిన్‌పేట–శంకర్‌పల్లి వెళ్లే దారిలో చిలకవాగు వద్ద వృక్షం విరిగి రోడ్డుపై పడటంతో వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు. రోడ్డు పక్క నుంచి బురదలో వాహనాలు వెళ్తుండటంతో భయాందోళనకు గురవుతున్నారు.
హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు
బంట్వారం: హత్య కేసులో ముగ్గురి నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా సెషన్స్ జడ్జి సున్నం శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం తీర్పు వెల్లడించారని ఎస్పీ నారాయణరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. కోట్‌పల్లి మండలం ఇందోల్ గ్రామానికి చెందిన బాసుపల్లి పెంటప్ప, హన్మంతు అన్నాదమ్ములు. వీరి దాయాదులు బాసుపల్లి అంజిలప్ప కుటుంబంతో తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో 2014 డిసెంబర్ 4న రాత్రి హన్మంతు తన ఇంటికి వెళ్తుండగా అంజిలప్ప ఘర్షణకు దిగాడు. అదే సమయంలో అంజిలప్ప కుమారులు శ్రీనివాస్, పాండు అక్కడికి చేరుకున్నారు. తండ్రీకొడుకులు కలిసి హన్మంతు తలపై రాయి, కర్రతో దాడి చేయగా అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ విషయమై మృతుడి సోదరుడు బాసుపల్లి పెంటప్ప ముగ్గురిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్‌ఐ రమేశ్ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కరణ్‌కోట్ సీఐ శివశంకర్ సమగ్రంగా దర్యాప్తు జరిపి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. వాదోపవాదనలు విన్న జిల్లా జడ్జి సున్నం శ్రీనివాస్‌రెడ్డి ముగ్గురు నిందితులకు జీవిత ఖైదుతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. పీపీలు నారాయణగౌడ్, రవికుమార్, సుధాకర్‌రెడ్డి, అప్పటి దర్యాప్తు అధికారులు శివశంకర్, రమేష్, ప్రస్తు త సీఐ రఘురాములు, ఎస్‌ఐ గఫార్, సీడీఓ మహేష్‌రెడ్డి, బ్రీఫింగ్ అధికారి వీరన్నలను ఎస్పీ నారాయణరెడ్డి అభినందించారు.

అభివృద్ధి పనులకు భూమిపూజ

అభివృద్ధి పనులకు భూమిపూజ