
పిడుగుపాటు.. ముందే తెలిసేట్టు
షాబాద్: అకాల వర్షాలకు పిడుగులు పడి ప్రజలు, మూగజీవాలు మృత్యువాత పడుతున్నారు. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ప్రజా జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రకృతి వైఫరీత్యాలైన ఉరుములతో కూడిన వర్షాలతో పాటు పిడుగు పాటుతో ప్రాణ, ఆస్తినష్టం జరుగుతూనే ఉంది. ఏటా పిడుగుపాటుకు గురై అధిక సంఖ్యలో మూగజీవాలు, చాలా మంది ప్రజలు ప్రాణాలు సైతం కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. అయితే పిడుగు పాటుపై పరిశోధనలు చేసిన భారత వాతావరణ శాఖ ముందే పసిగట్టేందుకు ఓ యాప్‌ను ఆవిష్కరించింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటరాలజీ (ఐఐటీఎం) ‘దామిని’ యాప్‌ను రూపొందించింది.
యాప్ డౌన్‌లోడ్ ఇలా
ప్రతి పౌరుడు తన స్మార్ట్ ఫోన్‌లోని ప్లేస్టోర్ నుంచి దామిని యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్‌ను తెరిచి పేరు, మొబైల్ నంబర్, అడ్రస్, పిన్‌కోడ్ నమోదు చేయాలి. అనంతరం జీపీఎస్ లొకేషన్ కోసం యాప్‌ను వినియోగించే సమయంలో మీ ప్రాంతంలో పిడుగుపడే అవకాశం ఉందో లేదో మూడు రంగుల్లో చూపిస్తుంది.
ఎరుపు రంగు: మీరు ఉన్న ప్రాంతంలో మరో 7 నిమిషాల వ్యవధిలో పిడుగుపడే అవకాశం ఉంటే ఆ సర్కిల్ ఎరుపు రంగులోకి వస్తుంది.
పసుపు రంగు: మీరు ఉన్న ప్రాంతంలో 10 నుంచి 15 నిమిషాల్లో పిడుగు పడేలా ఉంటే ఆ సర్కిల్ పసుపు రంగుగా మారుతుంది.
నీలం రంగు: 18 నుంచి 25 నిమిషాలలోపు పిడుగు పడే అవకాశం ఉంటే ఆ సర్కిల్ నీలం రంగులో కనిపిస్తుంది.
ఇవి పాటించాలి
● నల్లటి మబ్బులు ఆకాశం అంతటా విస్తరించి భారీ వర్షం కురుస్తున్నప్పుడు రైతులు పొలాల్లో తిరగకుండా ఏవైనా భవనాల్లోకి లేక తాము ఉన్న స్థానంలోనే మోకాళ్లపై కూర్చొని రెండు చెవులను చేతులతో మూసుకోవాలి.
● బహిరంగ ప్రదేశాల్లో పిడుగుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొబైల్ సిగ్నల్స్ పిడుగుపడే అవకాశాన్ని ఎక్కువగా కల్పిస్తుంది. పంట పొలాల్లో వాడకూడదు.
● విద్యుత్ స్తంభాలు, సెల్‌ఫోన్ టవర్లు, బోర్‌పంప్ సెట్లకు దూరంగా ఉండాలి. బోరు మోటార్ల నుంచి వచ్చే నీటిని కూడా ఆ సమయంలో వినియోగించవద్దు.
● పశువులను మేతకు బయటకు తీసుకెళ్లకుండా పాకలోనే ఉంచాలి.
● పిడుగులు పొడవైన చెట్ల మీద పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వర్షం కురిసినప్పుడు చెట్ల కింద ఉండొద్దు.