
కార్మికుల సమస్యలు పరిష్కరించండి
తాండూరు టౌన్: కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఈనెల 20న సార్వత్రిక సమ్మె చేయనున్నట్లు మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ యూనియన్ సభ్యులు మంగళవారం మున్సిపల్ కమిషనర్ విక్రమ్‌సింహారెడ్డికి నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ.. పెట్టుబడిదారులకు, కార్పొరేట్ వ్యవస్థకు తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కుల చట్టాలను మార్చి వారికి అనుకూలమైన చట్టాలను అమలు చేస్తోందన్నారు. కార్మికులకు కనీస వేతన చట్టం ప్రకారం వేతనాలు చెల్లించడం, ఉద్యోగ భద్రత కల్పించడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి హక్కులను తుంగలో తొక్కిందన్నారు. వెట్టిచాకిరీ నుంచి బయట పడేందుకు కార్మికులంతా కలిసి సార్వత్రిక సమ్మె చేయనున్నట్లు తెలిపారు. కేంద్రం వెంటనే స్పందించి కార్మిక చట్టాల ప్రకారం వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్
సమ్మె నోటీసు అందజేత