మోమిన్‌పేట: మండల పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు మంగళవారం శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ విచ్చేయనున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శంకర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సుద్దోడ్కతండా బీటీ రోడ్డు, ఏన్కతల పెద్ద చెరువు మరమ్మతులు, మల్‌రెడ్డిగూడెం చెరువు మరమ్మతులు, మొరంగపల్లి, ఎన్కేపల్లి, కేసారం, సయ్యద్‌అల్లిపూర్, ఇజ్రాచిట్టంపల్లి, వెల్‌చాల్, దుర్గంచెర్వు గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. పార్టీ శ్రేణులు సకాలంలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.
క్రికెట్ పోటీలు ప్రారంభం
దుద్యాల్: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో సోమవారం మండలస్థాయి క్రికెట్ పోటీలు(దుద్యాల్ క్రికెట్ ప్రిమియర్ లీగ్) ప్రారంభమయ్యాయి. కొడంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకారం వేణుగోపాల్, ఎస్‌ఐ యాదగిరి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మెరుగు వెంకటయ్య పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో విద్యార్థులు, యువకులు, ఉద్యోగుల కోసం ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. ఈ పోటీల్లో విజేతగా నిలిచిన జట్టుకు రూ.7 వేలు, రెండో స్థానంలో నిలిచే జట్టుకు రూ.5 వేలు నగదు బహుమతి అందజేయనున్నట్లు నిర్వాహకులు నరేందర్, శ్రీకాంత్, అనిల్, కేశవులు, గాంధీ, సంతోష్, ఫరీద్ తెలిపారు.
భూ భారతికి 43 దరఖాస్తులు
ధారూరు: మండలంలోని ఎబ్బనూర్, హరిదాస్‌పల్లి, చింతకుంట గ్రామాల్లో సోమవారం భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు 43 అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. ఇకపై గ్రామాల్లోనే భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు సాజిదాబేగం, శ్రీనివాస్, దీపక్ సాంసన్ పాల్గొన్నారు. మంగళవారం కుమ్మర్‌పల్లి, దోర్నాల్, గురుదోట్ల గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించనునున్నట్లు అధికారులు తెలిపారు.
ర్యాంకుల ‘కమ్మదనం’
షాద్‌నగర్ రూరల్: ప్రభుత్వం ప్రకటించిన ఈఏపీ సెట్ ఫలితాల్లో ఫరూఖ్‌నగర్ మండలం కమ్మదనం గురుకుల విద్యార్థినులు సత్తాచాటారు. బైపీసీ విభాగంలో సిరి 2,234 ర్యాంకు, శ్రీహర్షిత 4,643, శిరీష 4,907, సౌమ్య 7,586, కీర్తన 8,741 ర్యాంకు, ఎంపీసీ విభాగంలో శైలజ 22,990 ర్యాంకు, సాయికీర్తన 25,903, మానస 27,493, సాయిప్రియ 28,577 ర్యాంకులు సాధించారు. 77 మంది ఇంటర్ పరీక్షలు రాయగా వంద శాతం ఉత్తీర్ణత సాధించామని ప్రిన్సిపల్ విద్యుల్లత తెలిపారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులతో పాటు సిబ్బందిని అభినందించారు.