
కారు అదుపు తప్పి యువకుడి మృతి
మరో ఇద్దరికి గాయాలు
ఆమనగల్లు: విఠాయిపల్లి సమీపంలో సోమ వారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన అజయ్‌కుమార్(30) మృతిచెందాడు. ఆమనగల్లు ఎస్‌ఐ వెంకటేశ్ కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన స్నేహితులు మనోజ్, అజయ్‌కుమార్, గణేశ్, త్రిముర్తులు స్విఫ్ట్ కారులో శ్రీశైలం వెళ్తున్నారు. విఠాయిపల్లి సమీపంలో పంది అడ్డు రావడంతో అజయ్‌కుమార్ కారును ఒక్కసారిగా పక్కకు తిప్పాడు. వాహనం అదుపు తప్పడంతో రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అజయ్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్న మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
వైద్య సేవల్లో నర్సుల పాత్ర కీలకం
మహేశ్వరం: వైద్య సేవల్లో నర్సుల పాత్ర ఎంతో కీలకమని అవేర్ సంస్థ చైర్మన్ మాధవన్‌జీ అన్నారు. మండల పరిధిలోని భగవతిపురంలో సోమవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్‌చేసి, నర్సులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అవేర్ సంస్థ డీజీ రాజవర్ధన్‌రెడ్డి, అవేర్ ఆస్పత్రి ఎండీ, ప్రొఫెసర్ ఇర్షాద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదవశాత్తు పౌల్ట్రీ యజమాని మృతి
కేశంపేట: కోళ్లకు దా ణా పంపిణీ చేసే యంత్రం పైన పడటంతో పౌల్ట్రీ ఫాం యజ మాని మృతిచెందిన ఘటన కాకునూర్ శివారులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లీల్యానాయక్ (48) ఊరి శివారులో కోళ్ల ఫారం నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం వీచిన ఈదురుగాలులతో ఫాంలోని దాణా యంత్రం పక్కకు జరిగింది. బీహర్ చెందిన కూలీలు కమల్‌సాదా, చింటూసాదాతో కలిసి సరిచేసేందుకు ప్రయత్నిస్తుండగా మిషన్ ఒక్కసారిగా ముగ్గురిపైనా పడింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా లీల్యానాయక్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. గాయాలపాలైన చింటూ, కమల్‌సాదా ఆరోగ్యం నిలకడగా ఉందని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ నరహరి తెలిపారు.
ఉద్యమకారుడిని కోల్పోయాం.
తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న లీల్యానాయక్ మృతి బీఆర్‌ఎస్‌కు తీరని లోటని మాజీ ఎంపీపీ ఎల్గనమోని రవీందర్ యాదవ్ అన్నారు. పీఏసీఎస్ చైర్మెన్ గండ్ర జగదీఽశ్వర్‌గౌడ్ తదితరులు లీల్యా మృతిపై సంతాపం వ్యక్తంచేశారు.
బస్సు ఢీకొని
మహిళలకు తీవ్ర గాయాలు
షాద్‌నగర్ రూరల్: ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన పట్టణ సమీపంలోని పరిగి రోడ్డులో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. షాబాద్ మండలం అంతారానికి చెందిన శివకుమార్ తన భార్య అనూషను ఆస్పత్రిలో చూపించేందుకు బైక్‌పై షాద్‌నగర్ వచ్చాడు. తిరిగి వెళ్తుండగా పరిగి రోడ్డులోని విష్ణు గ్రానైట్ సమీపంలో వెనక నుంచి వచ్చిన ఆర్టీసీ అద్దె బస్సు వీరిని ఢీకొట్టింది. బస్సు చక్రాలు అనూష కాలిపైనుంచి వెళ్లడంతో తీవ్రగాయాలయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ మేరకు శివకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై.. ప్రమాదంలో మా తప్పేమీ లేదని, శివకుమార్ మద్యం తాగి ఉన్నాడని, బైక్ అదుపు తప్పడంతో బస్సును ఢీకొన్నాడని యజమాని ఫిర్యాదు చేశాడు. ఇరువురి ఫిర్యాదులు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీ
ఇద్దరికి తీవ్ర గాయాలు
కడ్తాల్: ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని గానుగుమార్లతండాకు చెందిన మూడవత్ సోమ్లా ద్విచక్రవాహనంపై సోమవారం రాత్రి తండా నుంచి కడ్తాల్ వైపు వస్తున్నాడు. అదే సమయంలో రామస్వామి అనే వ్యక్తి కడ్తాల్ నుంచి అన్మాస్‌పల్లి బయలుదేరాడు. మార్గమధ్యలో కడ్తాల్– అన్మాస్‌పల్లి రహదారిపై ఇద్దరి బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడినవారిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

కారు అదుపు తప్పి యువకుడి మృతి