
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల వడపోత
తాండూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల జాబితా సిద్ధమవుతోంది. అధికారులు క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరిగి దరఖాస్తుల వడపోత ప్రక్రియ ప్రారంభించారు. పైలెట్ ప్రాజెక్టు కింద చెన్‌గేస్‌పూర్ గ్రామాన్ని ఎంపిక చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరవ్వగా తాండూరు మండలంలోని 33 గ్రామాలకు 722 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించారు. మరో రెండు రోజుల్లో లబ్ధిదారుల ఫైనల్ జాబితా సిద్ధం చేయనున్నట్లు ఎంపీడీఓ విశ్వప్రసాద్ తెలిపారు.
దరఖాస్తుల వడపోత
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్ల జాబితాను అందజేశారు. నాయకులు ఇచ్చిన జాబితాను మండల వెరిఫికేషన్ కమిటీ సభ్యులు ఎంపీడీఓ, ఎంఈఓ, పీఆర్ ఏఈలు దరఖాస్తులను వడపోత ప్రక్రియను ప్రారంభించారు. మల్కాపూర్ గ్రామంలో 55 ఇళ్లకు గాను 25 తిరస్కరించినట్లు సమాచారం. ఐదు ఎకరాలకు పైన భూమి కారు, ట్రాక్టర్, ప్రభుత్వ ఉద్యోగం, ఆర్‌సీసీ స్లాబ్ ఉన్న దరఖాస్తులను అధికారులు రిజక్ట్ చేస్తున్నారు.
తమవారి పేరుండాల్సిందే
ఇందిరమ్మ ఇళ్ల జాబితా సిద్ధం అవుతున్న తరుణంలో నాయకులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. తమ వారి పేర్లు లబ్ధిదారుల లిస్టులో కచ్చితంగా ఉండాలని కోరుతున్నారు. అవసరమైతే ఎమ్మెల్యేతో మాట్లాడిస్తామంటున్నారని సమాచారం. ఒక్కో గ్రామంలో కాంగ్రెస్‌లో రెండు వర్గాలుంటే ఇద్దరి మధ్య సయోధ్యను కుదిర్చి జాబితాను సిద్ధం చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇళ్లు కేటాయించండి
సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో తమకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని పలువురు అర్జీలు పెట్టుకున్నారు. కరన్‌కోట్ గ్రామానికి చెందిన శ్రీహరి, చంద్రవంచ గ్రామానికి చెందిన రాములు తమ పేర్లను జాబితాలో చేర్చాలని కోరారు.
రెండు రోజుల్లో జాబితా సిద్ధం
తిరస్కరించిన వారి స్థానంలో కొత్తవారికి కేటాయించాలని విజ్ఞప్తి