
పరిశ్రమల సహకారంతో నైపుణ్యాల వృద్ధికి కృషి
శంషాబాద్ రూరల్: మండలంలోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం నాస్‌కామ్ ఆధ్వర్యంలో అనుభవాత్మక ప్రాజెక్టు ఆధారిత అభ్యాసం, ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. పాఠ్యాంశంలో కలిపే అంశాలతో పాటు సహకార నమూనాలు, పట్టభద్రుల నైపుణ్య లక్ష్యాలకు అనుసంధానం, అమలుకు తగిన వ్యూహాల వాటిపై చర్చించారు. నాస్‌కామ్‌తో కళాశాల చేసుకున్న ఎంఓయూలో భాగంగా విద్యార్థులకు పరిశ్రమ అనుభవం, ఉపాధికి అనుగుణమైన నైపుణ్యాలు అందించడానికి దోహదపడుతుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.వి.ఆర్.రవీంద్ర అన్నారు. పరిశ్రమల సహకారంతో నైపుణ్యాల అభివృద్ధికి ఇది ఒక మార్గదర్శక మోడల్‌గా నిలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్‌ఈపీ 2020 అనుగుణంగా క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్‌లను పాఠ్యాంశంలో సమగ్రంగా ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. నాస్‌కామ్ ప్రతినిధులు షీబా థామస్, కమ్రాన్ అష్రఫ్, సీనియర్ కన్సల్టెంట్, కౌన్సిల్ ఫర్ స్కిల్స్ అండ్ కంపిటెన్సీస్ వై.రామ్మోహన్‌రావు, కళాశాల కంప్యూటర్ సైన్ డీన్ డాక్టర్ జి.వేంకటరామిరెడ్డి, పరిశోధన డీన్ డాక్టర్ జె.కృష్ణచైతన్య, విద్యా వ్యవహారాల డీన్ డాక్టర్ ఎస్.రాజేందర్, మూక్స్ అండ్ ఐఐఐసీ ఇంచార్జి డాక్టర్ ఎస్.వి.వసంత, ఎంఓఓసీఎస్ హెడ్ డాక్టర్ డి.కృష్ణ, పాల్గొన్నారు.