
వేసవి దుక్కులతో చీడపీడల నివారణ
శంషాబాద్ రూరల్: వేసవి దుక్కులతో పంటలకు ఆశించే చీడపీడల నివారించవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నేల ఆరోగ్య యాజమాన్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె.పవన్‌చంద్రారెడ్డి సూచించారు. పెద్దగోల్కొండలో సోమవారం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు వాతావరణ ఆధారిత సలహాలు, సూచనలు పాటించి సాగు చేసుకుంటే నష్టాలు రాకుండా చూసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. భూసార పరీక్షల ఆధారంగా పంటలకు తగు మోతాదులోనే ఎరువులు వాడాలని సూచించారు. పంట మార్పిడి, సేంద్రియ ఎరువులతో పెట్టుబడి తగ్గించుకోవడంతో పాటు అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. రీసెర్చ్ అసోసియేట్ డాక్టర్ జి.వినయ్ మాట్లాడుతూ... రైతులు సమగ్ర వ్యవసాయ విధానాన్ని అవలంభిస్తూ ఎరువుల వాడకాన్ని తగ్గించి నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. పశువుల ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రతలను మండల పశువైద్యాధికారి డాక్టర్ జి.శేఖర్ వివరించారు. ఇందుకు సంబంధించి రూపొందించిన కరపత్రాలను వారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో నార్సింగ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరక్టర్ ఎ.శ్రీకాంత్‌గౌడ్, మాజీ సర్పంచ్ లక్ష్మయ్య, సొసైటీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, రైతులు భాస్కర్‌గౌడ్, భోజిరెడ్డి, పాండురంగారెడ్డి, నర్సింహారెడ్డి, ఏఈఓ రాఘవేందర్‌గౌడ్, వ్యవసాయ కళాశాల పరిశోధన విద్యార్థిని వి.వర్షిత తదితరులు పాల్గొన్నారు.
నేల ఆరోగ్య యాజమాన్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పవన్‌చంద్రారెడ్డి
పెద్దగోల్కొండలో‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’