‘ఉపాధి’కి కత్తెర | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’కి కత్తెర

May 12 2025 9:36 AM | Updated on May 12 2025 9:36 AM

‘ఉపాధి’కి కత్తెర

‘ఉపాధి’కి కత్తెర

నాలుగేళ్ల కాలంలో కోటి పనిదినాల తగ్గింపు
● పనులు దొరక్క కూలీల అవస్థలు ● శరాఘాతంగా మారిన కొత్త నిబంధనలు ● ఉదయం, సాయంత్రం ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తేనే వేతనం

మొత్తం జాబ్‌ కార్డులు 1.83లక్షలు

కూలీల సంఖ్య 3.77లక్షలు

ప్రస్తుతం పనులు చేస్తున్న వారు 60 వేలు

వికారాబాద్‌: ఏటా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పని దినాల్లో భారీ కోత విధిస్తోంది. సంస్కరణల పేరుతో నిబంధనలను కఠినతరం చేస్తూ పేదలను పనులకు దూరం చేస్తోంది. గడిచిన నాలుగేళ్ల కాలంలో జిల్లాకు కల్పించాల్సిన పని దినాల్లో దాదాపు కోటి పని దినాలకు కోత పెట్టింది. దీంతో పేదల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది. వ్యవసాయ పనులులేని కాలంలో వలసల నివారణకు గాను కేంద్ర ప్రభుత్వం 2008లో దేశవ్యాప్తంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి అప్రతిహతంగా కొనసాగుతూ వస్తోంది. ఈ పథకం ద్వారా ఏటా లక్షలాది మంది పేదలు ఉపాధి పొందుతూ వస్తున్నారు. అయితే నాలుగేళ్లుగా పనిదినాల్లో కోత విధిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల అందుబాటులోకి తెచ్చిన కొత్త నిబంధనలు కూడా ఉపాధి పనులకు కూలీలను దూరం చేస్తోంది. పథకం ప్రారంభమైన సమయంలో కొన్ని పనులకే పరిమితం కాగా ప్రస్తుతం 266 రకాల పనులు చేర్చారు. కేంద్రం నిర్ణయించిన పనులు మాత్రమే చేపట్టాలనే నిబంధన ఉండటం ఇబ్బందిగా మారింది. గతంలో కూలీలు ఉదయం 6గంటలకే పనులకు వెళ్లి వారికి ఇచ్చిన పనులు పూర్తి చేసుకొని మధ్యాహ్న సమయానికి ఇళ్లకు చేరుకునే వారు. ప్రస్తుతం ఉదయం ఒక్కసారి, మధ్యాహ్నం తర్వాత మరోసారి పనులకు సంబంధించిన ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉండటంతో కూలీలు మండుటెండలోనే గంటల తరబడి అధికారుల కోసం వేచి చూడాల్సి వస్తోంది. ఈ కారణంగా కూడా కొంత మంది కూలీలు పనులకు దూరమవుతున్నట్లు సమాచారం.

గత ఏడాదితో పోలిస్తే..

జిల్లాలో 1,86,197 జాబ్‌కార్డులు.. 3,77,087 మంది కూలీలు ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుత వేసవిలో కేవలం 60వేల మంది కూలీలే ఉపాధి పనులకు వస్తున్నట్లు తెలిసింది. గత ఏడాది ఇదే సమయంలో లక్షమందికి పైగా కూలీలు పనులకు రాగా ఈ సారి వారి సంఖ్య భారీగా తగ్గింది. ఇటీవల కేంద్రం ఉపాధి కూలీల వేతనం పెంచడంతో రోజువారి కూలి రూ.307కు చేరింది. ప్రస్తుతం జిల్లాలో సగటున రోజుకు రూ.270 చెల్లిస్తున్నారు. నాలుగేళ్ల కాలంలో జిల్లాకు కోటి పనిదినాల తగ్గించడంతో ఈ ప్రభావం పేదల జీవన స్థితిగతులపైనే కాకుండా గ్రామీణాభివృద్ధిపై కూడా పడింది. గత ఆర్థిక సంవత్సరంలో 67,37,496 పనిదినాలు కల్పించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యంగా పెట్టుకొని పూర్తి చేయడం ద్వారా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది.

ఏటా తగ్గుతున్న పని దినాలు ఇలా..

ఆర్థిక సంవత్సరం జిల్లాకు కేటాయించిన

పని దినాలు

2021 – 22 1.3 కోట్లు

2022 – 23 71.58 లక్షలు

2023 – 24 62 లక్షలు

2024 – 25 59.85 లక్షలు

2025 – 26 33 లక్షలు

ఉపాధి పనులు జరిగే ప్రాంతాల్లో వసతులు లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నా నీడకరువైంది. గతంలో నెట్‌ షెడ్లు, ప్రాథమిక చికిత్స కిట్లు పంపిణీ చేసేవారు. మూడేళ్లుగా వీటి పంపిణీ ఆగిపోయింది. కూలీలకు గ్రామ పంచాయతీలే వసతులు కల్పించాలని అధికారులు చెబుతున్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.

వేతన పాట్లు

జిల్లాలో డీఆర్‌డీఏ శాఖలో కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వహిస్తున్న 200 మంది ఉద్యోగులకు నెలనెలా వేతనాలు అందడంలేదు. అటెండర్లు, సీసీలు, ఏపీఓలు, టీఏలు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఏపీఎంలు వేతన వెతలు అనుభవిస్తున్నారు. ప్రస్తుతం మూడు నాలుగు నెలలకు ఒక్కసారి వేతనాలు ఇస్తుండటంతో అప్పులు చేయాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది నుంచి ఇరవై ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నా తమను క్రమబద్ధీకరించడం లేదని కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం ఇస్తున్న కూలి కూడా గిట్టుబాటు కావడం లేదని, బయటి పనులకు వెళ్తే రోజుకు రూ.600నుంచి రూ.800ల వరకు వస్తున్నట్లు పలువురు కూలీలు తెలిపారు. ప్రభుత్వం ఉపాధి పని దినాలను పెంచడంతోపాటు వసతులు కల్పించాలని, అలాగే వేతనం కూడా పెంచాలని కూలీలు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement