
నేడు మంత్రి పర్యటన
అనంతగిరి: రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ 12న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అధికారులకు సూచించారు. పరిగి, వికారాబాద్ పర్యటనలో చేపట్టాల్సిన అంశాలపై వైద్యారోగ్యశాఖ అధికారులతో ఆదివారం మధ్యాహ్నం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం 12.30గంటలకు పరిగి పట్టణ కేంద్రంలో వంద పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు భూమి పూజ, వికారాబాద్ కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో ఆస్పత్రుల పనితీరు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై సమీక్ష ఉంటుందన్నారు. అనంతరం వికారాబాద్‌లో నిర్మించిన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ప్రారంభిస్తారని చెప్పారు. ఈ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, వైద్యారోగ్య శాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పంట రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం
నావంద్గీ సొసైటీ చైర్మన్ వెంకట్‌రామ్‌రెడ్డి
బషీరాబాద్: వానాకాలం పంటలకు రైతులకు రూ.50 లక్షలతో కొత్తగా పంట రుణాలు ఇస్తున్నామని నావంద్గీ(బషీరాబాద్) సొసైటీ చైర్మన్ వెంకట్‌రామ్‌రెడ్డి ఆదివారం ఓప్రకటనలో తెలిపారు. సొసైటీలో ఉంటూ రుణం పొందలేని వారు సోమవారం నుంచి కొత్త రుణాలను తీసుకోవచ్చన్నారు. మొదటి విడతగా జిల్లా కో ఆపరేటీవ్ బ్యాంక్ ఈ రుణాన్ని నావంద్గీ సొసైటీకి మంజూరు చేసిందని చెప్పారు. గతంలో సొసైటీ నుంచి రుణమాఫీ పొందిన రైతాంగానికి సైతం కొత్త రుణాలను అందజేస్తామని వివరించారు. కొత్తగా రుణం పొందే రైతులు భూమికి సంబంధించి తాజా పహానీ, వన్‌బీ, నో డ్యూస్ సర్టిఫికెట్, నాలుగు రైతు ఫొటోలు నావంద్గీ సొసైటీ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
నేడు 50 వసంతాల స్ఫూర్తి సభ
కొడంగల్ రూరల్: అరుణోదయ సాంస్కృతిక విజ్ఞాన సమాఖ్య 50 వసంతాల స్ఫూర్తి సభను విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు ఎరన్‌పల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. నగరంలోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం 10గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమం ఉదయం 9గంటల ర్యాలీతో ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రజా సంస్కృతి, ప్రజా సాంస్కృతికోద్యమ నిర్మాణంపై చర్చ, రాత్రి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయని వివరించారు. ఉద్యమకారులు, కవులు, కళాకారులు, అభిమానులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
వివాహ వేడుకలో స్పీకర్
తాండూరు రూరల్: తన చిన్ననాటి స్నేహితుడి ఇంట్లో జరిగిన వివాహ వేడుకలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హాజరయ్యారు. ఆదివారం పట్టణంలోని వినాయక కన్వెన్షన్‌లో గౌతపూర్ మాజీ సర్పంచ్ రాజప్పగౌడ్ కుతూరు అంజలిగౌడ్ వివాహం బషీరాబాద్ మండలం గోట్టిగ ఖుర్ధుకు చెందిన మహేష్‌కుమార్ గౌడ్‌తో నిర్వహించారు. ఈ వివాహానికి హాజరైన స్పీకర్ ప్రసాద్‌కుమార్ నూతన దంపతులను ఆశీర్వదించి చిన్ననాటి స్నేహితులతో సరదగా గడిపారు.
తప్పుల తడకగా ఇందిరమ్మ ఇళ్ల జాబితా
● రీసర్వే చేయించి అర్హులకు కేటాయించాలి
● సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్
తాండూరు టౌన్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా తప్పులతడకగా ఉందని.. ఎమ్మెల్యే వెంటనే స్పందించి రీసర్వే చేయించి పారదర్శకంగా అర్హులకే దక్కేలా చూడాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఇళ్లు లేని అభాగ్యులకు, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే స్పందించి అర్హులకు దక్కేలా చూడాలని లేదంటే సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.