
పత్తి రైతుకు విత్తన భారం
నవాబుపేట: ఆరుగాలం శ్రమించి తీసిన పంటకు గిట్టుబాటు రాక నష్టపోతుంటే ఏటేటా పెరుగుతున్న విత్తనాలు, ఎరువుల ధరలతో రైతులకు అదనపు భారం పడుతోంది. గతేడాది పత్తిసాగు సమయంలో వర్షాలు లేక దిగుబడి తగ్గింది. ఈ ఏడాది తాజాగా బీటీ–2 పత్తి విత్తనాలు రూ.38 పెంచడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన పంటగా..
కొంత కాలంగా రైతులు వానాకాలం సాగు ప్రధాన పంటగా పత్తి సాగుచేస్తున్నారు. నవాబుపేట మండలంలోనే గతేడాది 21,539 ఎకరాల్లో సాగు చేశారు. ఈ సారి సైతం అంతే మొత్తంలో సాగు చేసే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు ఒక ఎకరాకు రెండు నుంచి మూడు పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరం అవుతాయి. అర కిలో బీటీ పత్తి ప్యాకెట్ ధర గతేడాది రూ.835 ఉండగా ఈ సారి రూ.901కి పెంచారు. ఇప్పటికే రైతులు వానాకాలం సాగుకు తమ పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు.
ఉన్నతాధికారులకు నివేదిక
వానాకాలంలో నవాబుపేట మండలానికి 1,200 మెట్రిక్ టన్నుల యూరియా, 820 మెట్రిక్ టన్నుల డీఏపీ, 1,380 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 110 మెట్రిక్ టన్నుల ఎంఓపీ ఎరువులు, 50 టన్నుల ఎస్‌ఎస్‌పీ ఎరువులు అవసరం అవుతాయని మండలాధికారులు ఉన్నతాధికారులకు నివేదించినట్లు సమాచారం.
రైతులను నమ్మబలుకుతున్న డీలర్లు
డీలర్లు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రైతులు అడిగన కంపెనీ విత్తనాల మార్కెట్‌లో తక్కువ మొత్తంలో లభిస్తున్నాయని.. తాము బ్లాక్‌లో తెస్తున్నామని రైతులను నమ్మబలికి సొమ్ము చేసుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సైతం ఈ విషయంలో చూసీచూడనట్లు వ్యవహరించడం సరికాదంటున్నారు.
ఏటా పెరుగుతున్న ధరలు
ఆందోళనలో కర్షకులు
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే ఎరువులు, విత్తనాలు విక్రయించాలి. నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయిస్తే డీలర్లపై చర్యలు తప్పవు. రైతులు తప్పని సరిగా విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసినప్పుడు రశీదు తీసుకోవాలి. ప్రభుత్వం గుర్తింపు పొందిన డీలర్ల వద్దనే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలి. – జ్యోతి, మండల వ్యవసాయాధికారి, నవాబుపేట

పత్తి రైతుకు విత్తన భారం