
బహుదూరపు బాటసారి..
బంట్వారం: పాలమూరు గొర్రెల కాపరులను బహుదూరపు బాటసారులుగా పిలుస్తున్నారు. ఏడాదిలో 8 నెలల పాటు కురుమ, గొల్లలు వివిధ జిల్లాల్లో గొర్రెల మందలతో మేత మేపడం కోసం తిరుగుతూనే ఉంటారు. బంట్వారం, కోట్‌పల్లి మండలాల్లో సైతం వస్తుంటారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన గొర్రెల కాపరులు బృందాలుగా ఏర్పడి మందలతో బయలు దేరుతారు. ప్రతీఏటా దీపావళి తర్వాత ఇళ్లను వదిలి జీవాలతో సంచరిస్తుంటారు. పాలమూరు జిల్లా ఒకప్పుడు కరువు కాటకాలతో కొట్టుమిట్టాడుతుండేది. మూగజీవాలను బతికించుకునేందుకు అక్కడి గొర్రెల కాపారులు నానాతంటాలు పడేవారు. ఈ క్రమంలోనే వారు అప్పట్లోనే గొర్రెల మందలతో మేత కోసం సూదూర ప్రయాణం చేస్తుంటారు. నేటికి కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నారు. వేలాది గొర్రెలతో రోడ్డు మార్గంలో వందల కిలోమీటర్లు కాలినడకన సంచరిస్తుంటారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కుల వృత్తిని మాత్రం వదిలి పెట్టమని గర్వంగా చెబుతున్నారు.
తరచూ ప్రమాదాలు
సూదూర ప్రయాణం రోడ్డు మార్గంలో కూడా సాగడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని చెబుతున్నారు. వాహనాలు ఢీకొని జీవాలు చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్సూరెన్స్ లేకపోవడంతో తాము నష్టపోతున్నామని చెబుతున్నారు. సంబంధిత పశు సంవర్ధక శాఖ అధికారులు జీవాలకు ఇన్సూరెన్స్ చేయించడం లేదు. అవగాహన కల్పించడం లేదు.
ఎక్కడ చీకటి పడితే అక్కడే..
నెలల తరబడి ఇంటికి దూరంగా ఉంటున్నారు. వందలాది కిలో మీటర్లు తిరుగుతూ ఎక్కడ చీకటి పడితే అక్కడే పొలాల్లో నిద్రిస్తున్నారు. సరైన భోజనం, నీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్నారు. జీవాలకు సైతం తాగునీరు కరువైంది. వాగులు, వంకలు అందుబాటులో ఉంటేనే నీరు తాగిస్తున్నారు. జూన్‌లో వచ్చే మృగశిర కార్తె వరకు బయటనే కాలం గడుపుతారు. వర్షాలు మొదలవ్వగానే మెల్లగా మందలతో పాలమూరుకు తిరు పయనమవుతారు.
పొలాల్లో మందలు వేస్తూ..
రాత్రి వేళ పొలాల్లో మందలు వేస్తే రైతులు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు. బియ్యం ఇతర నిత్యావసర సరుకులు అందజేస్తున్నారు. వీటితోనే కాపారులు కాలం గడుపుతున్నారు. పొలాల్లోనే వంట చేసుకుంటున్నారు. తెల్లవారగానే భోజనం సిద్ధం చేసుకుని సద్దిమూట, నీటి డబ్బాలతో మళ్లీ గొర్రెల మందతో ముందుకు సాగుతున్నారు. గొర్రెల ఎరువు పొలాలకు చాలా బలం కావడంతో రైతులు పోటీ పడి రాత్రి వేళ మందలు వేసుకుంటున్నారు.
మందకు నలుగురు..
ఇదే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నాం. 8 నెలల పాటు బయటి ప్రపంచానికి దూరంగా ఉంటాం. రెండు నెలలకు ఒక సారి ఇంటికి వెళ్లి వస్తాం. ఒక్కో మందకు నలుగురు కాపలాగా ఉంటారు. మొదక్, కరీంనగర్ ప్రాంతాల్లో కూడా తిరుగుతాం. వర్షాకాలం వరకు బయటనే ఉంటాం. గొర్రెల కాపరులను ప్రభుత్వం పట్టించుకోవాలి. – ఆనందం, గొర్రెల కాపరి
ఇన్సూరెన్స్ లేక నష్టం
ఇన్సూరెన్స్ లేకపోవడంతో నష్టపోతున్నాం. రోడ్డు పొడువునా చాలా దూరం వెళ్తుంటాం. కొన్ని సార్లు లారీలు, ఇతర వాహనాలు గొర్రెల మందను గుద్దేసి పోతాయి. ఎవరూ పట్టించుకోరు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. కులవృత్తి కావడంతో వదిలిపెట్టడం లేదు. చాలా కాలంగా ఇదే వృత్తిని నమ్ముకని బతుకుతున్నాం. అప్పడప్పుడు ఇంటికి వెళ్లి వస్తుంటాం. జూన్ వరకు గొర్రెల మందలతో ఉంటాం. ప్రభుత్వం గొర్రెల కాపారులను ఆదుకోవాలి.
– ఐలయ్య, గొర్రెల కాపరి
పాలమూరు గొర్రెల కాపరులు
నెలలతరబడి ఇంటికి దూరం
కులవృత్తిని నమ్ముకుని జీవనం
ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాపరులు
ప్రభుత్వం ఆదుకోవాలి

బహుదూరపు బాటసారి..

బహుదూరపు బాటసారి..