
అనుమానాస్పద స్థితిలో కాంట్రాక్ట్ కార్మికుడి మృతి
తాండూరు రూరల్: అనుమానాస్పద స్థితిలో ఓ కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన కరన్‌కోట్ గ్రామ శివారులోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)లో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి, బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కరన్‌కోట్ గ్రామానికి చెందిన ఉస్సేన్ అలీ(39)కి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సీసీఐ ఫ్యాక్టరీలో పంప్‌హౌస్‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా 15 సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి విధులకు వెళ్లాడు. శనివారం తెల్లవారుజామున పని ప్రదేశంలో ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. అక్కడే పని చేస్తున్న ఉస్సేన్ అలీ సోదరుడు మహబూబ్ అలీకి తోటి కార్మికులు సమాచారం ఇచ్చారు. వెంటనే ఉస్సేన్ అలీని తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించగా అప్పటికే అలీ మృతి చెందినట్లు నిర్ధారించారు. తన తమ్ముడి మృతిపై విచారణ జరిపి న్యాయం చేయాలని సోదరుడు పోలీసులను కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఫ్యాక్టరీ గేటు వద్ద ఆందోళన
కార్మికుడు చనిపోయిన విషయం తెలుసుకున్న మృతుని బంధువులు, కార్మికులు, గ్రామ నాయకులు ఫ్యాక్టరీ గేటు వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న కరన్‌కోట్ ఎస్‌ఐ విఠల్‌రెడ్డి సిబ్బందితో ఫ్యాక్టరీ వద్దకు చేరుకొని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఫ్యాక్టరీ యాజమాన్యంతో గ్రామ నాయకులు, కార్మిక సంఘాలు పలు దఫాలుగా చర్చలు జరిపారు. బాధిత కుటుంబానికి కంపెనీ పరంగా రావాల్సిన అన్ని సదుపాయాలు సమకూరుస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పంప్‌హౌస్ కాంట్రాక్టర్ నుంచి రూ.లక్ష పరిహారం, కంపెనీ నుంచి రూ.7 లక్షల ఇన్సూరెన్స్, మృతుని భార్యకు ఉద్యోగం, ప్రతి నెలా రూ.3 వేలు, ఒక్క పిల్లాడికి రూ.500 పెన్షన్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీటీీసీ మాజీ సభ్యుడు రాజ్‌కుమార్, నాయకుడు శ్రీనుగౌడ్, సీసీఐ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శరణప్ప, మాజీ ఉప సర్పంచ్ హేమంత్, పలువురు కార్మికులు, నాయకులు పాల్గొన్నారు.
కరన్‌కోట్‌లోని సీసీఐ ఫ్యాక్టరీలో ఘటన
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన
మద్దతుగా నిలిచిన కార్మికులు,
గ్రామ నాయకులు
ఆదుకుంటామని యాజమాన్యం హామీ

అనుమానాస్పద స్థితిలో కాంట్రాక్ట్ కార్మికుడి మృతి