
మహిళల అభ్యున్నతికి కృషి
పరిగి: మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న 70 మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు, సర్టిఫికెట్లను శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మహిళల రాజ్యం నడుస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వారి పేరిటే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు వివరించారు. కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వమని పేర్కొన్నారు. ప్రస్తుత ఆధునిక సమాజంలో ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో విరివిగా ఉపాధి అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు ఆ దిశగా ఆలోచన చేసి వృద్ధి సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబుమోసెప్, పరిగి, కుల్కచర్ల మార్కెట్ కమిటీల చైర్మన్లు పరశురాంరెడ్డి, ఆంజనేయులు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
సైనికుల కుటుంబాలకు అండగా ఉంటాం
పాకిస్తాన్‌పై జరిగిన యుద్ధంలో అమరులైన వీర సైనికుల కుటుంబాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుడు మురళీనాయక్‌కు నివాళులర్పించారు. ఆయన సేవలను దేశం ఎప్పటికీ మరచిపోదని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి