
ఖైదీల్లో మానసిక పరివర్తన రావాలి
కుషాయిగూడ: ఖైదీల సంక్షేమం కోసం తెలంగాణ జైళ్ల శాఖ అమలు చేస్తున్న సంస్కరణలతో ఖైదీలు మానసిక పరివర్తన చెందాలని రాష్ట్ర ప్రభుత్వ హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా అన్నారు. తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో చర్లపల్లి సెంట్రల్ జైలులో ఏర్పాటుచేసిన ఖైదీల వార్షిక స్పోర్ట్స్ కల్చరల్ మీట్–2025ను శుక్రవారం జైళ్ల శాఖ డీజీపీ డాక్టర్ సౌమ్య మిశ్రాతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఖైదీల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్‌కు హాజరు కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఖైదీలు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రస్తుతం ఉన్న ఫిట్‌నెస్‌ను విడుదల అనంతరం వరకు కూడా కొనసాగించాలన్నారు. జైళ్ల శాఖ అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకొని నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. జైళ్ల శాఖ డీజీపీ డాక్టర్ సౌమ్య మిశా మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలతో ఖైదీల్లో క్రమశిక్షణతో పాటుగా మానసిక పరివర్తన సాధ్యమవుతుందన్నారు. అంతేకాకుండా వారి మధ్య స్నేహభావం పెంపొందుతుందన్నారు. మూడు రోజుల పాటు జరిగే స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్‌లో అవుట్‌డోర్, ఇండోర్ క్రీడలతో పాటు కల్చరల్ ఈవెంట్స్‌ను కూడా నిర్వహిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 220 మంది ఖైదీలు ఈ మీట్‌లో పాలుపంచుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ ఐజీలు రాజేష్, మురళీబాబు, పాల్గొన్నారు.