
సన్నబియ్యంపై కన్ను!
● పక్కదారి పట్టించేందుకు
దళారుల ప్రయత్నాలు
● లబ్ధిదారుల నుంచి
సేకరించే పనిలో నిమగ్నం
● కిలోకు రూ.15 నుంచి రూ.20
చెల్లిస్తామంటూ మంతనాలు
● అధికారులు కఠినంగా వ్యవహరిస్తేనే అడ్డుకట్ట పడే అవకాశం
దౌల్తాబాద్: చౌక ధరల దుకాణాల ద్వారా ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని కొంతమంది అక్రమార్కులు పక్కదారి పట్టించే ప్రయత్నాలు ప్రారంభించారు. రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు స్పందించి దీన్ని అడ్డుకోవాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి.
కర్నాటకకు తరలింపు
దౌల్తాబాద్ మండలం కర్నాటక సరిహద్దుకు 6 కిలోమీటర్లు దూరంలో మాత్రమే ఉంది. ఆయా గ్రామాల్లో సన్నబియ్యం సేకరించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. గతంలో రేషన్ ద్వారా అందించిన దొడ్డు బియ్యాన్ని రూ.10 చొప్పున సేకరించి, దళారులకు విక్రయించేవారు. అనంతరం వీటిని రీసైక్లింగ్ చేసి, కర్నాటకకు తరలించేవారు. ప్రస్తుతం ప్రభుత్వం అందజేస్తున్న సన్నబియ్యంపై వీరి కన్ను పడింది. దౌల్తాబాద్‌తో పాటు కోస్గి, మద్దూరు మండలాల్లో కొనుగోలు చేసిన బియ్యాన్ని ఒక చోట నిల్వ చేసి ఆతర్వాత మినీ వ్యాన్లు, ఆటోల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సన్నబియ్యం కిలోకు రూ.20 చెల్లిస్తామంటూ భేరసారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
పెరుగుతున్న వ్యాపారుల సంఖ్య
సన్నబియ్యం తినేందుకు కొంతమంది లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. గతంలో దొడ్డు బియ్యం తరలిస్తూ పట్టుబడిన కొందరు వ్యాపారులు, వాహనాల డ్రైవర్లే ఈ విషయాన్ని చెబుతున్నారు. ఇలాంటి వారినుంచి సన్నబియ్యం సేకరించి, బ్లాక్ మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కర్నాటకకు సరిహద్దున ఉన్న దౌల్తాబాద్ మండలం దళారుల అక్రమ వ్యాపారానికి అనుకూలంగా ఉంది.
6–ఏ కేసులతో సరి
మండలంలో గతంలో సబ్సిడీ బియ్యం పట్టుకున్న సందర్భాల్లో అధికారులు 6– ఏ కేసులతో సరిపెట్టారు. ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి..? వ్యాపారి ఎవరు? అనే కోణంలో విచారణ చేస్తే అసలు సూత్రధారులు తెలిసే అవకాశం ఉంటుంది. కానీ అవేవీ పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు ఎప్పటిలాగే వారి పని కానిచ్చేస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ, సివిల్ సప్లయ్ యంత్రాంగం దృష్టి సారిస్తేనే అక్రమ దందాకు అడ్డుకట్ట పడుతుంది. ఆదిశగా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి.