
ఐఎస్‌ఐ గుర్తింపు తెచ్చుకోవాలి
తాండూరు టౌన్: పట్టణంలో కొనసాగుతున్న వాటర్ ప్లాంట్లకు నిబంధనల ప్రకారం ఐఎస్‌ఐ గుర్తింపు ఉండాలని మున్సిపల్ కమిషనర్ విక్రమ్‌సింహా రెడ్డి అన్నారు. గురువారం ఆయన పట్టణంలోని 70 వాటర్ ప్లాంట్ల యజమానులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఐఎస్‌ఐ గుర్తింపు కోసం మూడు నెలలు గడువు ఇస్తున్నట్లు చెప్పారు. తదనంతరం వాటర్ ప్లాంట్లను సీజ్ చేస్తామన్నారు. వేసవిలో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతారనే ఉద్దేశంతో మాత్రమే గడువు ఇచ్చినట్లు చెప్పారు. వాటర్ పంపిణీకి ఉపయోగించే ప్లాస్టిక్ బాటిళ్లను నిత్యం శుభ్రం చేయాలని, ఆరు నెలలకు ఒకసారి కొత్త బాటిళ్లను తెప్పించాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ బాటిళ్లకు బదులుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను యజమానులు చూసుకోవాలన్నారు. వాటర్‌ను సక్రమంగా ఫిల్టర్ చేయాలని, ప్లాంటు పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలన్నారు. ఫిల్టర్ కాగా మిగిలిన వ్యర్థ నీటిని విధిగా ఇంకుడు గుంతలు తవ్వించి అందులోకి వదలేయాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా, అపరిశుభ్ర తాగునీటిని పంపిణీ చేసినా అట్టి ప్లాంట్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ప్లాస్టిక్ బాటిళ్లకు ప్రత్యామ్నాయం చూసుకోవాలి
వ్యర్థ నీటిని ఇంకుడు గుంతల్లోకి వదలండి
వాటర్ ప్లాంట్ యజమానులకు కమిషనర్ ఆదేశాలు