
ప్రహరీ పనులు ఆపేయండి
పహాడీషరీఫ్: మామిడిపల్లి గ్రామం 99/1 సర్వే నంబర్‌లో హౌసింగ్ బోర్డు అధికారులు చేపట్టిన ప్రహరీ నిర్మాణ పనులను వెంటనే ఆపేయాలని మాజీ కౌన్సిలర్ ఈరంకి వేణుకుమార్‌గౌడ్, బీజేపీ సీనియర్ నాయకుడు పెరమోని నరేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం అంబేడ్కర్ విగ్రహం వద్ద దీక్ష చేపట్టిన గ్రామస్తులకు సంఘీభావం ప్రకటించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కోసం మామిడిపల్లి రైతులు వందల ఎకరాల భూములు ఇచ్చారన్నారు. వీరిలో చాలా మందికి పరిహారం ఇవ్వలేదని తెలిపారు. రైతుల నుంచి సేకరించిన కొంత భూమిని టీజీఐఐసీకి కేటాయించారని, అందులో కంపెనీలు పెట్టి స్థానికులకు ఉపాధి కల్పిస్తామని చెప్పారని, ఇప్పటి వరకూ ఆచరణలోకి తేలేదని మండిపడ్డారు. 99/1 సర్వే నంబర్ భూమిలో మల్లన్నస్వామి, కొండ మైసమ్మ, రామాలయం, కాటమయ్యస్వామి, ఎల్లమ్మ దేవాలయాలు ఉన్నాయని తెలిపారు. వీటితో పాటు అంబేద్కర్ విగ్రహం, దోబీఘాట్, క్రీడా మైదానం, శ్మశానవాటిక ఉందన్నారు. వీటిలోకి వెళ్లకుండా చుట్టూ ప్రహరీ నిర్మించేందుకు అధికారులు చదను పనులు ప్రారంభించారని పేర్కొన్నారు. భూములను త్యాగం చేసిన రైతులతో పాటు గ్రామంలోని నిరుపేదలకు ఈ భూమిలో 60 గజాల ఇంటి స్థలం కేటాయించి, ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహం నుంచి రంగనాయకులస్వామి ఆలయం వెలుపల వరకు ప్రహారీ పనులు నిలిపి వేయాలన్నారు. దాదాపు 20 ఎకరాల స్థలాన్ని గ్రామ అవసరాలకు కేటాయించాలన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ విషయంలో ప్రభుత్వం స్పందించాలని కోరారు. అనంతరం వీరి దీక్షకు మాజీ కార్పొరేటర్ యాతం పవన్‌కుమార్ యాదవ్ కూడా మద్దతు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు నందీశ్వర్, గుర్జని గణేశ్‌గౌడ్, అర్జున్, పురుషోత్తం, రాజు, లక్ష్మీపతి, నర్సింహ, జగన్, శ్రీకాంత్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
మామిడిపల్లివాసుల నిరసన
సంఘీభావం ప్రకటించిన నాయకులు