
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
ఆశవర్కర్ల యూనియన్ మండల అధ్యక్షురాలు అమృత
బంట్వారం: ఆశవర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర యూనియన్ కోట్‌పల్లి మండల అధ్యక్షురాలు అమృత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మంగళవారం పలువురు ఆశవర్కర్లతో కలిసి ఆమె కోట్‌పల్లి పీహెచ్‌సీలో మెడికల్ ఆఫీసర్ మేఘనకు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 20న కేంద్ర, రాష్ట్ర ఉద్యోగుల ఫెడరేషన్లు, అసోసియేషన్ల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలన్నారు. నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసి 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలన్నారు. ఆశవర్కర్లను మూడో తరగతి ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలన్నారు. సీనియార్టి ప్రాతిపదికన ఏఎన్‌ఎంలుగా పదోన్నతి కల్పించాలన్నారు. అనంతరం 16 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మెడికల్ ఆఫీసర్‌కు అందజేశారు. కార్యక్రమంలో ఆశవర్కర్లు విజయ, శోభారాణి, అండాలు, సుమిత్ర, జయమ్మ, సంపూర్ణ, వినోద, లక్ష్మీఇందిరా తదితరులు పాల్గొన్నారు.