
రైతులకు భూధార్ కార్డులు
● మండల వ్యవసాయాధికారి కొమరయ్య ● ఏఈఓలకు వివరాలు అందజేయాలని అన్నదాతలకు సూచన
తాండూరు రూరల్: ఆధార్ తరహాలో కేంద్ర ప్రభు త్వం ప్రతి రైతుకూ 11 అంకెలతో కూడిన యూనిక్ కోడ్(భూధార్ కార్డు)ను కేటాయిస్తుందని మండల వ్యవసాయాధికారి కొమరయ్య తెలిపారు. సోమ వారం పట్టణంలోని వ్యవసాయశాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయాలని కేంద్ర ప్రభు త్వం నిర్ణయించగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపడుతోందన్నారు. రైతు యూనిక్ కోడ్ పొందాలంటే ఆధార్‌కార్డుతో పాటు లింక్ చేసిన సెల్‌ఫోన్ నంబర్, పట్టాదారు పాసుపుస్తకం కలిగి ఉండాలన్నారు. ఈ ఫార్మర్ రిజిస్ట్రీ రైతు పేరు, ఆధార్, గ్రామం, భూముల సర్వే నంబర్లు, విస్తీర్ణం, సెల్‌ఫోన్ నంబర్ తదితర వివరాలను నమోదు చేస్తే రైతుకు గుర్తింపు సంఖ్య వస్తుందన్నారు. రైతు వేదికలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, మున్సి పల్ వార్డు కార్యాలయాల్లో సంబంధిత ఏఈఓలకు పై పేర్కొన్న వివరాలు అందజేయాలని రైతులకు సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రీలో రైతులు తమ వివరాలు నమోదు చేస్తేనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే పీఎం కిసాన్ నిధులు వస్తాయన్నారు. అన్నదాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.