
సాగుపై అవగాహన పెంచుకోవాలి
యాచారం: ఆధునిక పద్ధతుల్లో పంటల సాగుకు రైతులు అవగాహన, చైతన్యం పొందాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్త ఏకాద్రి పేర్కొన్నారు. మండల పరిధిలోని గడ్డమల్లయ్యగూడలో సోమవారం ‘రైతు ముగింట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటల సాగులో ఎరువుల యాజమాన్యంపై రైతులు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. తక్కువ యూరియా, అవసరం మేరకు రసాయనాల వినియోగంతో నేలతల్లిని కాపాడుకోవాలన్నారు. రైతులు కొనుగోలు చేసే విత్తనాలు, ఎరువుల రసీదులను జాగ్రత్తగా దాచి పెట్టుకోవాలని చెప్పారు. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరిలో రకాలు, కొత్తరకం వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు మాట్లాడుతూ.. ఈ నెల 31 వరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు నమోదు కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. రైతు నమోదు కార్యక్రమానికి పట్టాదారు, పాసుపుస్తకం, ఆధార్ కార్డుకు లింకు ఉన్న ఫోన్ నంబర్ వివరాలతో రైతు వేదికల వద్దకు వచ్చి వివరాలు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం డివిజన్ ఏడీఏ సుజాత, యాచారం పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, యాచారం మండల వ్యవసాయాధికారి రవినాథ్ తదితరులు పాల్గొన్నారు.