
వివాహిత ఆత్మహత్య
జీడిమెట్ల: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ అపార్ట్‌మెంట్ భవనం పైనుంచి దూకి అత్మహత్యకు పాల్పడిన సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెపెక్టర్ గడ్డం మల్లేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన లక్ష్మి(25)కి గత డిసెంబర్‌లో హరికృష్ణతో వివాహం జరిగింది. భార్యాభర్తలు సుభాష్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివా సం ఉంటున్నారు. హరికృష్ణ ఓ ప్రైవేట్ పరిశ్రమలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. కాగా ఆదివారం ఉదయం లక్ష్మి తాము ఉంటున్న అపార్ట్‌మెంట్ 5వ అంతస్తు నుంచి కిందకు దూకింది. దీనిని గుర్తించిన అపార్ట్‌మెంట్ వాసులు అక్కడకు వెళ్లి చూడగా తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికడే మృతిచెందింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అస్పత్రికి తరలించారు. కాగా లక్ష్మికి పెళ్లి ఇష్టం లేని కారణంగానే అత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని సమాచారం. మృతురాలి తల్లిదండ్రుల వచ్చిన తర్వాత వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
పాత కక్షల నేపథ్యంలో కత్తితో దాడి
మల్లాపూర్: పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. నాచారం ఇన్‌స్పెక్టర్ రుద్విర్ కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అవదేశ్ కుమార్ వర్మ(50), బాబు రామ్ వర్మ(55) నగరానికి వలస వచ్చి మల్లాపూర్ వీఎన్‌ఆర్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకున్న బాబురామ్ వర్మ అదను కోసం ఎదురు చూస్తున్నాడు. ఇందుకుగాను కొబ్బరి కాయలు కొట్టే కత్తిని కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకున్నాడు. ఆదివారం ఉదయం అతను అవదేశ్ కుమార్ వర్మపై కత్తితో దాడిచేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు అతడిని నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. ప్రసుత్తం అవదేశ్ కుమార్ వర్మ ఆరోగ్య నిలకడగానే ఉందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.