
భూ భారతితో రైతులకు మేలు
నవాబుపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకవచ్చిన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ కొత్త చట్టంపై రైతులకు అవగాహన కల్పించి వారి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ ద్వారా చాలా సమస్యలు అలాగే ఉండిపోయాయన్నారు. తాను జిల్లాలో బాధ్యతలు చేపట్టే నాటికి 15 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండేవాని, వాటిని 5 వేలకు తెచ్చినట్లు వివరించారు. భూ భారతి చట్టంతో జిల్లాలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రతి మండలానికి 5 నుంచి 6 మంది వరకు సర్వేయర్లను నియమించడం జరుగుతుందన్నారు.
రైతు సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే
అనంతరం ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లా డుతూ.. భూమికి రైతుకు అవినాభావ సంబంధం ఉందన్నారు. భూమి ఉన్నంత కాలం రైతు ఉంటాడని పేర్కొన్నారు. భూమినే నమ్ముకొని బతుకుతున్న రైతులకు అధికారులు మేలు చేయాలని సూచించారు. వారి సమస్యలపై సానుకూలంగా స్పందించాలన్నారు. అన్నదాతల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తెచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కిసాన్ సంఘం నాయకుడు మాణిక్‌రెడ్డి, ఆర్‌డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ జైరాం, ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్ నాయక్, పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, మండల వ్యవసాయాధికారి జ్యోతి, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్‌జైన్