
వరిధాన్యం సేకరణకు చర్యలు
అనంతగిరి: జిల్లాలోని ప్రతి కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం సేకరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. శనివారం వరి ధాన్యం కొనుగోలుపై పౌరసరఫరాల అధికారులు, రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ తన ఛాంబర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 129 కొనుగోలు కేంద్రంలో ధాన్యం సేకరణకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. రైతులు కష్టపడి పండించిన పంట వర్షాలతో తడిసిపోకుండా కావలసిన తాడిపత్రీలు, సంచులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. తూనిక, తేమ యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లర్లకు చేరవేయాలని ఆయన పేర్కొన్నారు. ధాన్యాన్ని సేకరించేందుకు హమాలీలను తగిన సంఖ్యలో పెంచుకోవాలని చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి మోహన్ బాబు, జిల్లా మేనేజర్ మోహన్ కృష్ణ, మార్కెటింగ్ ఏడి సారంగపాణి, వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి, జిల్లా సహకార అధికారి నాగార్జున, డీసీఎంఎస్ అధికారి శ్యామ్ సుందర్ రెడ్డి, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.
జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్