
రిజిస్ట్రేషన్.. నో టెన్షన్
షాద్‌నగర్: స్థిరాస్తి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరింత సులభం కానుంది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజుల నమోదు కోసం గంటల తరబడి నిరీక్షించే అవసరం ఉండదు. పది నుంచి 15 నిమిషాల్లో ప్రక్రియ పూర్తి కానుంది. ఇందుకు గాను రిజిస్ట్రేషన్ల శాఖ సంస్కరణలు చేపట్టింది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ విధానాన్ని అమలు చేసేందుకు జిల్లాలోని ఐదు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను ఎంపిక చేశారు.
రెండో విడతలో భాగంగా..
రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానానికి మంచి స్పందన వచ్చింది. విడతల వారీగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈనెల 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయనున్నారు. రెండో విడతలో భాగంగా జిల్లాలోని ఫరూఖ్‌నగర్, షాద్‌నగర్, మహేశ్వరం, వనస్థలిపురం, శేరిలింగంపల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. స్లాట్ బుకింగ్ విధానాన్ని ఈ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మొదటి విడతలో శంషాబాద్, సరూర్‌నగర్, చంపాపేట్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఎంపిక కావడంతో అక్కడ ఇప్పటికే స్లాట్‌బుకింగ్ విధానం కొనసాగుతోంది.
అనుకున్న సమయానికి ..
దస్తావేజుల రిజిస్ట్రేషన్ కోసం అనుకున్న సమయానికి, తేదీకి, ఆన్‌లైన్‌లోనే స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, ఆ తర్వాత 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. స్లాట్ బుకింగ్ చేసుకున్న సమయానికి కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని వెళ్లిపోవచ్చు.
స్వయంగా దస్తావేజుల తయారీ
స్థిరాస్తి దస్తావేజులు నమోదు చేసుకునే వారు డాక్యుమెంట్ రైటర్లపై ఆధారపడకుండా స్వయంగా తయారు చేసుకోవడానికి వెబ్‌సైట్‌లో ప్రత్యేక మాడ్యూల్ ప్రవేశపెట్టారు. మొదటగా సేల్ డీడ్ దస్తావేజుల కోసం వెసులుబాటు ఉంది. రిజిస్ట్రేషన్ సమయంలో దస్తావేజుపై అమ్మినవారు, కొన్నవారు, సాక్షులు తర్వాత సబ్‌రిజిస్ట్రార్ సంతకాలు చేయడం, వాటిని స్కానింగ్ చేయడానికి సుమారు గంట సమయం పడుతుంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో జరిగే జాప్యాన్ని నివారించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చార్ట్‌బోర్డ్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు.
నిరీక్షణకు తెర
మరింత సులభతరంగా స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం
పది నుంచి పదిహేను నిమిషాల్లోనే పూర్తి కానున్న ప్రక్రియ
రంగారెడ్డి జిల్లాలో ఆరు సబ్‌రిజిస్ట్రార్‌కార్యాలయాల ఎంపిక
ఈనెల 12 నుంచి అమలు